హైదరాబాద్: కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీని చేశారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను చేశారని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
‘‘ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రజలు భాజపాను ఆదరించారు. ఒక్క స్థానం నుంచి 8 సీట్లకు పెరిగాం. 6 నుంచి 14 శాతానికి మా ఓటు బ్యాంకు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాల రాసింది. మజ్లిస్‌తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ పార్టీ వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌ను చేసింది. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయడాన్ని భాజపా వ్యతిరేకిస్తుంది. అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌ను చేశారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో భాజపా ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయరు. ఈ అంశంపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ ఎన్నికను ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తరువాతే భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా.. దగ్గినా పడిపోతుంది అందుకే మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోంది’’ అని కిషన్ రెడ్డి విమర్శించారు.