బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు
ఎల్బీనగర్, వనస్థలిపురం, వాయిస్ టుడే:
బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం మాజీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ టిక్కెటును ఆశించి భంగపడ్డారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ టిక్కెటు వస్తుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కు టిక్కెటు రాకపోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం రామ్మోహన్ గౌడ్ ను ఎలాగైనా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయనతో చర్చించాలని నిర్ణయించింది. పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి తన్నీరు హరీష్ రావు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ నివాసానికి వచ్చి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, లక్ష్మీ ప్రసన్న దంపతులకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి రామ్మోహన్ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, లక్ష్మీ ప్రసన్న దంపతులను కలిశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. అనంతరం వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేవని, పార్టీ అధిష్టానం నిర్ణయంతో వాటిని పక్కన పెట్టామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలను కలుపుకుపోయి ఎల్బీనగర్ లో, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ నివాసం మొత్తం సందడి నెలకొన్నది