మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్‌ఆర్‌పీఎస్ నిర్వహించిన మాదిగ విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ.. సభకు హాజరైన వారందరినీ కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసిందుకు, సభకు తనను ఆహ్వానించినందుకు మంద కృష్ణ మాదిగకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మోదీ తెలిపారు.
స్వాతంత్య్రం వచ్చాక అనేక పార్టీలు అధికారంలోకి వచ్చాయని కేవలం తమ ప్రభుత్వం మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని మోదీ చెప్పుకొచ్చారు. 30 ఏళ్ల మాదిగల పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ఉంటుందని తెలిపిన మోదీ.. ఇకపై మీరు ఏది అడగాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. మోదీ ఇంకా మాట్లాడుతూ.. ‘పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చితం చేసేందుకు నేను వచ్చాను. పార్టీలు చేసిన తప్పులకు నేను క్షమాపణ చెబుతున్నాను. పేదరిక నిర్మూలన మా తొలి ప్రాధాన్యత. సామాజిక న్యాయం దిశగా మేము అడుగులు వేస్తున్నాము. అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మోసం చేసింది. తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పోరాటం చేశాయి. దళితుడిని మొదటి ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్, ప్రభుత్వం ఏర్పడగానే తానే ముఖ్యమంత్రి అయ్యి దళితుల ఆశాలపై నీళ్లు జల్లాడు. మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు, దళిత బంధుతో కూడా లాభం జరగలేదు’ అని చెప్పుకొచ్చారు.
ప్రధాని ఇంకా మాట్లాడుతూ.. ‘తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్ కాపాడలేకపోయింది. కొత్త రాజ్యాంగం పేరుతో కేసీఆర్ అంబేద్కర్‌ని అవమానించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు, ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో ఇరిగేషన్ స్కీమ్‌లు, ఇరిగేషన్ స్కామ్‌ల మారాయి. ఆదివాసీ మహిళను మేం రాష్ట్రపతిగా ప్రాతిపాదించాం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెను అవమానించింది. బీఆర్‌ఎస్ రైతు రుణమాఫీ చేస్తామంది, ఎంత మాఫీ చేశారో చెప్పగలరా.?’అని మోదీ ప్రశ్నించారు.
‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు అవినీతికి ఆనవాళ్లు. బీఆర్‌ఎస్, ఆమ్‌ఆద్మీ పార్టీతో కలిసి వేల కోట్ల మద్యం అవినీతికి తెర తీశాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయి. కానీ ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నాయి. ఇలాంటి అవకాశవాద రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.