22.1 C
New York
Friday, May 31, 2024

సంజయ్ పోటీకి ప్రతిపక్షాల గింజులాట

- Advertisement -

సంజయ్ పోటీకి ప్రతిపక్షాల గింజులాట
కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థిగా బండి దూకుడు
అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరు?
ఎన్నికలు దగ్గరపడుతున్నా ఇంకా తేల్చని వైనం
ప్రచారంలో వెలిచాల రాజేందర్రావు, ప్రవీణ్ రెడ్డి పేర్లు
ఓ దశలో విజయశాంతి, తీన్మార్ మల్లన్న కూడా
ఓ మాజీ మంత్రిని చేర్చుకుని టికెట్ ఇస్తారనే టాక్
బీఆర్ఎస్ తరఫున బరిలో వినోద్ కుమార్
కానీ, అంతర్గత సమస్యలతో కారు పార్టీ సతమతం
సేఫ్ జోన్ లో ఉన్నది బండి సంజయ్ మాత్రమే
మోదీ హవాకు వ్యక్తిగత కరిష్మా తోడైతే విజయం ఖాయం
(వాయిస్ టుడే ప్రతినిది, హైదరాబాద్)

తెలంగాణలో అత్యంత కీలకమైన లోక్ సభ నియోజకవర్గాల్లో కరీంనగర్ ఒకటి. ఉద్యమానికి పురిటిగడ్డ అయిన ఈ సీటులో గత ఎన్నికల్లో బీజేపీ తరఫున విజయదుందుభి మోగించారు బండి సంజయ్. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ తనదైన శైలిలో పార్టీని బలోపేతం చేశారు. అనూహ్య పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు సారథ్యం నుంచి తప్పుకొన్నా.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో అత్యంత కీలకమైన బాధ్యత దక్కింది. అనంతరం తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకుని మరోసారి కరీంనగర్ నుంచి పోటీకి దిగారు.

ఇటు సంజయ్ అటు ఎవరు?

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు కరీంనగర్ అభ్యర్థి ఎవరో తేల్చలేకపోయింది. వెలిచాల రాజేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేర్లు మొదటినుంచి వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఖరారు కాలేదు. ఓ దశలో సినీ నటి, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిని అభ్యర్థిగా నిలిపాలని ఆలోచించినట్లు సమాచారం. కానీ, ఆమె సంజయ్ పై పోటీకి విముఖత చూపారని అంటున్నారు. మధ్యలో తీన్మార్ మల్లన్న సైతం నేనున్నానంటూ ముందకొచ్చినా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకోలేదు. చివరకు బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రిని కాంగ్రెస్ లో చేర్చుకుని టికెట్ ఇస్తారనే కథనాలు కూడా వచ్చాయి. అయితే, ఆయన కూడా మొగ్గుచూపలేదని సమాచారం. వాస్తవానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందినవారే. ఆయన 2006 ఉప ఎన్నికలో కరీంనగర్ నుంచి పోటీ చేశారు కూడా. కానీ, కాంగ్రెస్ ఆయనకు ఈసారి నిజామాబాద్ టికెట్ ఇచ్చింది. వెరసి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది? ఇంకా ప్రశ్నగానే మిగిలింది.

వినోద్ కుమార్ కు సీటిచ్చినా..?

బీఆర్ఎస్ మాత్రం మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు ముందుగానే కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత కారు పార్టీ తీవ్ర ఒడిదొడుకులకు లోనయింది. నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. మధ్యలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి జైలుకెళ్లారు. నిజామాబాద్ మాజీ ఎంపీ, కరీంనగర్ తో అనుబంధం కూడా ఉన్న కవిత లిక్కర్ కేసులో జైలుకెళ్లడం ఆ పార్టీకి ఈ ప్రాంతంలో చెడ్డ పేరు తెచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికితోడు గత ఎన్నికల్లో బండి సంజయ్ చేతిలో వినోద్ కుమార్ పరాజయం పాలయ్యారు. మరోసారి సంజయ్ నే ఎదుర్కొనాల్సి రావడం.. అప్పటికి ఇప్పటికీ సంజయ్ మరింత బలమైన నాయకుడిగా ఎదగడం బీఆర్ఎస్ కు ఇబ్బందిగానే మారింది.

గెలిస్తే కేంద్ర మంత్రి సంజయ్?

ప్రత్యర్థి పార్టీలు వెనుకబడిన నేపథ్యంలో కరీంనగర్ బరిలో సంజయ్ ఇప్పటికైతే ముందంజలో ఉన్నారు. వ్యక్తిగత కరిష్మా, ప్రధాని మోదీ హవా తోడుగా వచ్చే ఎన్నికల్లో సంజయ్ విజయం సాధిస్తే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే కేంద్ర మంత్రి పదవి దక్కడం ఖాయం. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసిన నాయకుడిగా సంజయ్ కు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వద్ద మంచి పేరుంది. అన్నిటికి మించి ఆర్ఎస్ఎస్ అండ ఉంది.

బండికి అండాదండగా మున్నూరు కాపులు

కరీంనగర్ నియోజకవర్గంలో మున్నూరు కాపుల ప్రభావం ఎక్కువ. అత్యధిక శాతం ఓట్లున్న వీరంతా ఇప్పడు బండి సంజయ్ వెనుక నిలుస్తున్నారు. పార్టీ పరిమితుల రీత్యా సంజయ్ సొంత సామాజిక వర్గం గురించి మాట్లాడలేకున్న.. మున్నూరు కాపులు మాత్రం అంతర్గతంగా ఆయన వెంటే నిలిచే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈ సామాజికవర్గంలోని కొందరు సంజయ్ కు పూర్తిస్థాయిలో మద్దతు పలకలేదు. అయితే, అప్పటికి ఇప్పటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇప్పుడు అందరూ ఏకతాటిపై నిలిచి సంజయ్ కు జై కొడుతున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!