పుట్ట మధన్న గెలుపుతోనే మనం బాగుపడుతం
మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని: మంథని నియోజకవర్గ ప్రజలకే మా జీవితాలు అంకితం చేశామని, ఈ మట్టిలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం మంథని మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు రజక, మంగలివాడ, ఉస్మాన్‌పూర్, విశ్వాబ్రాహ్మణవీధి, భగత్‌నగర్‌లలో వార్డు కౌన్సిలర్ గర్రెపల్లి సత్యం ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృధ్ది జరిగిందన్నారు. అంతేకాకుండా అనేక సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందించామని గుర్తు చేశారు. తొమ్మిదేండ్ల కాలంలో తాను సర్పంచ్‌గా, మున్సిపల్ చైర్ పర్సన్‌గా పుట్ట మధూకర్ సహకారంతోనే మంథనికి అభివృద్ది బాటలు వేశామన్నారు.అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పాలకుల చేతిలో ఇబ్బందులుపడ్డ మంథని ప్రజల భవిష్యత్ కోసమే మా ఆరాటమంతా అని అన్నారు. తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్ సర్కార్ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పుట్టమధూకర్ చొరవతో మంథని పరిధిలో బురదరోడ్లు లేకుండా సిమెంటు రోడ్లు వేయించామని, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి చేసినట్లు చెప్పారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన అందించామని ఆమె చెప్పారు. నాలుగేండ్లు పుట్ట మధూకర్‌కు ఎమ్మెల్యే అవకాశం కల్పిస్తే ఒకవైపు అభివృధ్ది, సంక్షేమ పథకాలతో పాటు తన తల్లిపేరు ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించారని, నాలుగేండ్ల అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇక్కడ పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల హయాంలో మంథని పరిస్థితి ఎలా ఉండేదో బేరీజు వేసుకోవాలన్నారు. పని చేసే నాయకులు ఎవరో పట్టించుకోని నాయకులు ఎవరో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోలో పొందుపర్చిన పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేసేలా ఉన్నాయని, ముఖ్యంగా గృహిణీలకు ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్రతి గృహిణికి ఇంటి అవసరాలకు మూడు వేలు, రూ.400లకే గ్యాస్‌సిలిండర్‌తో పాటు కేసీఆర్ భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ప్రభుత్వపథకాలతో పాటు ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆమె తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఐదేండ్ల మాసర్కారు లేదన్నడే కానీ ఎవరికైనా సాయం చేసిండా అని ఆలోచన చేయాలని, మా ప్రభుత్వం లేదన్నోల్లకు మళ్లీ ఓట్లు వేసుడెందుకని ఆమె అన్నారు. మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్ గెలుపుతోనే మనం బాగుపడుతామని, రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి పుట్ట మధూకర్‌ను ఆదరించి ఆశీర్వదించాలని ఆమె కోరారు.