28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పూజల్లో పాల్గొనాలి
వైసీపీ నేతలు, కార్యకర్తలకు జగన్ పిలుపు
డిక్లరేషన్‌పై ఉత్కంఠ…
Participate in pujas in all temples across the state
అమరావతి సెప్టెంబర్ 26
ఈనెల 28న మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతున్న నేపద్యం లో జగన్ తిరుమలకు వచ్చే రోజే అంటే ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైసీపీ నేతలు, కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. “తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వేంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, స్వామివారి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో సెప్టెంబరు 28న పూజల్లో పాల్గొనాలని వైయస్సార్‌సీపీ పిలుపునిస్తోంది” అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 28న తిరుపతికి వచ్చి అలిపిరి నడక దారిలో తిరుమల చేరుకుని 29న శ్రీవారిని దర్శించుకుంటారని సమాచారం.
డిక్లరేషన్‌పై ఉత్కంఠ…
అయితే అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వస్తే డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వంలో ఉండటంతో అధికారులు ఎవరూ జగన్‌ను డిక్లరేషన్ గురించి ఒత్తిడి చేయలేదు. దీంతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల దర్శనానికి వెళ్లారు. అయితే తిరుమలకు వచ్చే భక్తులు కచ్చితంగా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జగన్ కచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిందే అని కూటమి పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరి ఈ నెల 28న తిరుమలకు వస్తున్న జగన్ డిక్లరేషన్ ఇస్తారా.. లేదా అనే ఉత్కంఠ సర్వాత్రా నెలకొంది.