- Advertisement -
ఉప ఎన్నికలల్లో పార్టీలు
Parties in by-elections
హైదరాబాద్, సెప్టెంబర్ 10, (న్యూస్ పల్స్)
తెలంగాణలో పది స్థానాలకు ఉపఎన్నికలు వస్తాయని అందరూ సిద్దం కావాలని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ వేదికగా పిలుపునిచ్చారు. దీనికి కారణం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడమే. నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ సుమోటోగా కేసు విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు తర్వాత బీఆర్ఎస్‌లో ఉత్సాహం కనిపిస్తోంది. ఉపఎన్నికలకు రెడీ అయిపోవాలని అంటున్నారు. కానీ నిజంగా ఆ పార్టీ ఇప్పుడు ఉపఎన్నికలను ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉందా అంటే బీఆర్ఎస్ నేతలు కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి క్యాడర్ ఇప్పుడు ఏ మాత్రం ఎన్నికల మూడ్ లో లేదు. చాలా మంది నేతలు పొలిటికల్ సర్వైవర్ కోసం ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే సగం మంది క్యాడర్ పక్క చూపులు చూస్తున్నారని వారి లక్ష్యం స్థానిక ఎన్నికలేనని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఇటీవల పిలుపునిచ్చిన కొన్ని ఆందోళలను.. పార్టీ క్యాడర్ ఎవరూ పట్టించుకోలేదు. చివరికి కవిత అరెస్టు సమయంలో.. విడుదలైన సందర్భంలో చేయాలనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న విధంగా చేయలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం.. కవిత అరెస్టు , పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక చోట్ల డిపాజిట్లు కోల్పోవడం వంటివి ఆ పార్టీ క్యాడర్ నైతిక స్తైర్యాన్ని గట్టిాగనే దెబ్బతీశాయి.పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వారిపై అనర్హతా వేటు పడితే ఉపఎన్నికలు వస్తాయి. మరి ఈ పది సీట్లలో బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇచ్చే నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయంటే చెప్పడం కష్టం.బలమైన నేతల కొరత ఉంది. అధికారంలో లేకపోవడం పెద్ద మైనస్. కాంగ్రెస్ పార్టీకి అధికారం ప్లస్. పైగా బీజేపీ రేజ్ లో ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తామే ప్రతిపక్ష మని అంటున్నారు. ఇప్పుడు ఎలాంటి ఉపఎన్నికలు వచ్చినా బీజేపీ గట్టిగా పోరాడుతుంది. ప్రదాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం బీఆర్ఎస్ వ్యూహకర్తలకు తెలియనిదేం కాదు. అయినా ఉపఎన్నికలకు రెడీ కావాలని క్యాడర్ కు పిలుపునిస్తున్నారు. అనర్హతా పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అనర్హతా పిటిషన్లన్నీ స్పీకర్ ముందు పెట్టాలని సూచించింది. నిజానికి స్పీకర్ కార్యదర్శికి ఈ వ్యవహారంలో నామ మాత్రమైన పాత్ర ఉంటుంది. పూర్తి అధికారం స్పీకర్ దే. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం .. తన వద్దకు వచ్చిన అనర్హతా పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ ఒక్కరికే ఉంది. ఫలానా సమయంలోపు పరిష్కరించాలన్న రూల్ చట్టంలో లేదు. శాసన అధికారాల్లోకి కోర్టులు కూడా చొరబడలేవని న్యాయనిపుణులు చెబుతున్నారు. అందుకే కోర్టు నేరుగా స్పీకర్ కు ఎలాంటి ఆదే్శాలు జారీ చేయలేదు. అంటే.. స్పీకర్ నిర్ణయం మేరకు ఉంటుంది. నాలుగు వారాల తర్వాత కోర్టు విచారణ జరిపినా స్పీకర్ ను ఆదేశించలేదని చెబుతున్నారు. అయితే కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా.. అప్పీల్ పిటీషన్లు ఉండనే ఉంటాయి. అందుకే ఎమ్మెల్యేలపై అనర్హతా అనేది బీఆర్ఎస్ చేస్తున్నంత సులువుగా అయ్యేది కాదని.. కానీ కాంగ్రెస్ అనుకుంటే మాత్రం వచ్చేస్తాయని చెబుతున్నారు. ఉపఎన్నికలు రావాలని కాంగ్రెస్ అనుకుంటే.. అనర్హతా పిటిషన్లు ఆమోదించడం కన్నా.. వారితో రాజీనామాలు చేయిస్తుంది. అప్పుడు ఉపఎన్నికలు వస్తాయి. అలా కాకుండా అనర్హతా వేటు వేసే అవకాశాలు ఒక్క శాతం కూడా ఉండవని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసు కాబట్టే బీఆర్ఎస్ పార్టీ మారకండా ఉన్న తమ ఎమ్మెల్యేలకు మరింత భయం ఉండేలా ఉపఎన్నికల గురించి ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం రాజకీయాల్లో వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో పండిపోయిన కేసీఆర్ లాంటి నేతలకు.. ముఖ్యంగా ఉపఎన్నికల రాజకీయాల్లో మాస్టర్స్ చేసిన కేసీఆర్‌కు ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉందో తెలియదా అని బీఆర్ఎస్ క్యాడర్ కూడా సర్ది చెప్పుకుంటున్నారు.
- Advertisement -