హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార పార్టీ బీఆర్ఎస్ స్పీడును పెంచింది. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం సీఎం కేసీఆర్ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. కేబినెట్‌లో పట్నం మహేందర్‌రెడ్డికి చోటు కల్పించాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనికి ముహూర్తం సైతం ఖరారైంది. బుధవారం (ఆగస్టు 23) ఉదయం 11:30గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది. 11.30 గంటలకు పట్నం మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఇప్పటివరకు కేసీఆర్ భర్తీ చేయలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఈటల స్థానాన్ని మహేందర్‌రెడ్డితో భర్తీ చేయనున్నారు. పలువురు పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ సీఎం కేసీఆర్.. కొంత కాలం నుంచి అసంతృప్తతో ఉన్న పట్నం వైపు మొగ్గుచూపారు.మంత్రి వర్గంలో 18 మందికి మాత్రమే ఛాన్స్ ఉంది. గతంలో 2014లో తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్లో ఛాన్స్ దక్కించుకోవడంతో మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.