మంగళగిరి కార్యాలయం వద్ద కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్
గుంటూరు,జూలై 24
Pawan Kalyan welcomed the ‘kumki’ elephants at the Mangalagiri office.
విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును అదుపు చేసేందుకు అటవీశాఖ కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు బయలుదేరిన ‘జయంత్’, ‘అభిమన్యు’ అనే రెండు కుంకీ ఏనుగులకు మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్వాగతం పలికారు.కుంకీ ఏనుగులకు పూలమాలలు వేసి, స్వయంగా చెరుకు గెడలను ఆహారంగా తినిపించిన పవన్ కల్యాణ్… వాటికి వీడ్కోలు పలికారు. ఈ రెండు కుంకీ ఏనుగులను మొదట పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు తరలించి, అక్కడి నుంచి అడవి ఏనుగులు తిరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నియంత్రించేందుకు అటవీ అధికారులు పక్కా ప్రణాళిక రూపకల్పన చేశారు. జయంత్, అభిమన్యులకు గతంలో కూడా ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉండటంతో అధికారులు మొదట వీటినే రంగంలోకి దించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఒడిశా సరిహద్దుల నుంచి ఏనుగులు రాష్ట్రంలోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నందున, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఒడిశా నుంచి కూడా మరికొన్ని కుంకీ ఏనుగులను రప్పించి ఏనుగుల దాడులకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఆలోగా మన వద్ద ఉన్న కుంకీలతోనే జనవాసాల్లోకి వచ్చిన ఏనుగులను వీలైనంత త్వరగా తిరిగి అడవుల్లోకి మళ్లించేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఎర్ర చందనం వద్దలొద్దు
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమూలంగా నిర్మూలించాలని, అక్రమ రవాణాపై ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని దేశంలో ఏ మూలన దాచిపెట్టినా వదలొద్దని, స్మగ్లర్లతో పాటు వారి వెనుకున్న కింగ్ పిన్‌లపైనా ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైన అటవీ సంపద ఎర్రచందనం. దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. నిఘాను పటిష్ఠం చేసేందుకు డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. స్మగ్లింగ్ ముఠాల నెట్‌వర్క్‌ను మూలాలతో సహా పెకిలించాలి” అని అన్నారు.
ఇతర రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖ అధికారులతో తక్షణమే సమన్వయం పెంచుకోవాలని, దేశంలో ఎక్కడైనా అక్రమ నిల్వలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. స్మగ్లింగ్ ముఠాలకు నిధులు సమకూర్చే ఫైనాన్షియర్లపైనా దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గత రెండేళ్లలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో సాధించిన ప్రగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కాలంలో మొత్తం 506 కేసులు నమోదు చేసి 1,239 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్మగ్లింగ్‌కు వినియోగించిన 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కీలకమైన 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించలేదని గుర్తుచేశారు.అంతేకాకుండా, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి, అక్కడి అధికారుల సమన్వయంతో 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి అంతర్రాష్ట్ర ఆపరేషన్లు జరగలేదని వారు పేర్కొన్నారు. ఈ చర్యల ఫలితంగా గతంలో 3 శాతం కంటే తక్కువగా ఉన్న శిక్షల రేటు (కన్విక్షన్ రేటు) ఇప్పుడు 95 శాతానికి పెరిగిందని, నిందితులకు కోర్టులు శిక్షలు విధించేలా పటిష్టమైన ఆధారాలు సమర్పిస్తున్నామని వివరించారు. అన్ని శాఖల సమష్టి కృషితో ఎర్రచందనం సంపదను కాపాడతామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.




