పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీర మల్లు’ మొదటి భాగం టీజర్ విడుదల
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథనాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తలపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా ‘హరి హర వీర మల్లు’ అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
వీరమల్లుగా వెండితెరపై పవన్ కళ్యాణ్ సాహసాలను చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించాయి. తాజాగా నిర్మాతలు ఓ తీపి కబురు చెప్పారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని ప్రకటిస్తూ, మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేశారు. మొదటి భాగం “హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. “ధర్మం కోసం యుద్ధం” అనేది ఉపశీర్షిక.
పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న ‘హరి హర వీర మల్లు’ పాత్రను టీజర్ లో చూపించారు. హరి హర వీర మల్లు పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో టీజర్ ను రూపొందించిన తీరు కట్టిపడేసింది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లు టీజర్ స్పష్టం చేసింది.
పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఆహార్యం పరంగా, అభినయం పరంగా ఇద్దరూ ఆయా పాత్రలకు వన్నె తెచ్చారని టీజర్ తోనే అర్థమవుతోంది. టీజర్ లో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా నైనా, న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తోంది.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పటికే “కంచె”, “గౌతమిపుత్ర శాతకర్ణి”, “మణికర్ణిక” వంటి చిరస్మరణీయ విజయవంతమైన చిత్రాలను అందించారు. అణచివేతదారులకు వ్యతిరేకంగా, తమ దేశ స్వాతంత్ర్యం కోసం విరోచితంగా పోరాడిన యోధులను ఆయా చిత్రాలలో చూపించారు. “హరి హర వీర మల్లు” కూడా అలాంటి యోధుడి కథే. అతడు సంపన్నులు, కుటిల పాలకుల నుండి దోచుకొని.. పేద ప్రజలకు న్యాయం చేయడానికి సహాయం చేస్తాడు. అందుకే అతను పేదల పాలిట దేవుడయ్యాడు.
టీజర్ విడుదల సందర్భంగా, నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. “ఎనక్కు 20 ఉనక్కు 18”, “నీ మనసు నాకు తెలుసు”, “ఆక్సిజన్” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు “నట్పుక్కాగ”, “పడయప్ప” వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, ‘హరి హర వీర మల్లు’ చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.
‘హరి హర వీర మల్లు’ చిత్రాన్ని 2024 చివర్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.
నటీనటులు & సాంకేతిక నిపుణుల వివరాలు:
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు