- Advertisement -
పవన్ పై ఫ్యాన్స్ పార్టీ సాఫ్ట్ కార్నర్
Pawan's fan party is a soft corner
కాకినాడ, సెప్టెంబర్ 18, (వాయిస్ టుడే)
అధికారంలో ఉండగా తమకు ఎదురేలేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలకు ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతున్నట్లు కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో వివిధ అంశాలపై ఆ పార్టీ స్పందిస్తున్న తీరు చూస్తే… కొన్ని విషయాల్లో వైసీపీ వైఖరి మారినట్లే కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్న వైసీపీ… కూటమి ప్రభుత్వంలో కీలక నేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్‌పై మెతక వైఖరి అవలంభిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. పిఠాపురంలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్…. స్థానిక ఎమ్మెల్యే పవన్ ఒక్కమాట కూడా అనకపోవడం వైసీపీ వైఖరిలో వచ్చిన మార్పును సూచిస్తోందంటున్నారు. పిఠాపురం పర్యటనలో పాపం పవన్ సినిమాల్లో నటిస్తే… సీఎం చంద్రబాబు రాజకీయాల్లో నటిస్తున్నారని విమర్శించారు. గతంలో ఎప్పుడూ కూడా పవన్ విషయంలో ఇలాంటి మెతక వైఖరి వైసీపీ అధినేతలో కనిపించలేదని అంతా గుర్తు చేస్తున్నారు. పవన్‌పై అవరసరం ఉన్నా, లేకపోయినా వ్యక్తిగత విమర్శలు చేసే జగన్.. ఆయన సొంత నియోజకవర్గంలో పల్లెత్తు మాట్లాడకపోవడమే చర్చకు దారితీస్తోంది. ఇక వైసీపీ నేతలు కూడా డిప్యూటీ సీఎం పవన్‌పై విమర్శలకు ఆలోచిస్తున్నారంటున్నారు.వైసీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా జనసేనాని పవన్ ఒక్కరినే టార్గెట్ చేసేవారు. ఎలాంటి కార్యక్రమమైనా… సందర్భం, సమయంతో సంబంధం లేకుండా పవన్‌పై విమర్శలతో విరుచుపడేవారు. దత్తపుత్రుడని, మూడు వివాహాలని వ్యక్తిగత విమర్శలు చేసేవారు. మాస్ హీరోగా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ క్రేజ్ ఉన్న పవన్‌పై ఈ విమర్శలు యువతను బాగా ప్రభావితం చేశాయనే విశ్లేషణలు ఉన్నాయి.ఇక పవన్ ఒక్కరే కాదు సినీ రంగానికి చెందిన ఎందరో హీరోలను వైసీపీ పెద్దలు చులకనగా చూసేవారనే విమర్శలు వినిపించేవి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పైనా విమర్శలకు వెనక్కి తగ్గేవారు కాదు. మెగాస్టార్‌పై మాజీ మంత్రి కొడాలి నాని వివాదాస్ప వ్యాఖ్యలు చేస్తే… సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై మొత్తం వైసీపీ బ్యాచ్ ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయారు. ఈ ఫలితం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించడంతో ఇప్పుడు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోందంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడానికి ముఖ్య కారణం పవన్ కల్యాణ్ మాత్రమేనని భావిస్తోందట వైసీపీ. పవన్, చంద్రబాబు చేతులు కలపకపోతే తమకు ఇంత డ్యామేజ్ జరిగేది కాదంటున్నారు వైసీపీ నేతలు. పవన్ను అనవసరంగా కెలికి నష్టపోయామనే భావనలో ఉన్నారంటున్నారు. దీంతో భవిష్యత్‌లో పవన్‌తో శత్రుత్వం పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి తమ విమర్శల దాడిలో వాడి తగ్గించేశారు. కేవలం చంద్రబాబు, టీడీపీ మంత్రులను టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలు… డిప్యూటీ సీఎం పవన్‌ను ఏ మాత్రం టచ్ చేయడం లేదు. ఒక వేళ పవన్‌ను టచ్ చేస్తే ఏం జరిగిందో.. ఏం జరగబోతోందో అన్న విషయాలపై స్పష్టమైన ఆలోచన ఉండటంతోనే ఎలాంటి విమర్శలకు దిగడం లేదంటున్నారు.వైసీపీ తాజా వ్యూహంపై పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. మాజీ సీఎం జగన్ అంటే ఒంటికాలిపై లేచే పవన్‌ను ఆ పార్టీ నేతలు విమర్శించడానికి సాహసం చేయకపోడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెబుతున్నారు. అందులో ఒకటి పవన్ సామాజికవర్గం కాపులైతే… రెండోది సినీ నేపథ్యం…. వైసీపీ ప్రభుత్వంలో సినీ రంగాన్ని నిర్లక్ష్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. 151 సీట్లు గెలిచిన జగనే ప్రజల్లో నిజమైన హీరో అనే భ్రమతో సినీ పెద్దలను తీవ్ర అవమానాలకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పేందుకు అప్పటి సీఎం జగన్‌ను కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవితోసహా టాలీవుడ్ ప్రముఖులు వస్తే వారిని అవమానించేలా వ్యవహారించం… చిరంజీవి దండం పెట్టిన వీడియోను ఎడిట్ చేసి విడుదల చేయడం అభిమానులను కలిచివేసిందంటున్నారు. దీంతో సినీ అభిమానులు అంతా ఏకమై కూటమికి జైకొట్టారని అంటున్నారు. ఇదే సమయంలో పవన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన సొంత సామాజికవర్గాన్ని దూరం చేసిందంటున్నారు.కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటి వారితో పవన్ వ్యక్తిగత అంశాలపైన విమర్శలు చేయించడం బెడిసి కొట్టింది. వెటరన్ లీడర్లైన ముద్రగడ, హరిరామజోగయ్య స్థానంలో తమ నాయకుడిగా పవన్‌ను కాపులు ఎంచుకోవడంతో వైసీపీ గల్లంతైందనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే 2019 ఎన్నికల్లో కాపుల మద్దతుతో గోదావరి జిల్లాల్లో ప్రభావం చూసిన వైసీపీ…. ఈ ఎన్నికల్లో అస్సలు ఖాతా తెరవలేకపోయిందంటున్నారు.ఇలా పవన్‌ను లక్ష్యంగా చేసుకోవడం, సినీ పెద్దలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వైసీపీ తన వ్యూహాన్ని మార్చిందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ… ప్రభుత్వంలో పవన్ ఉన్నారన్న విషయమే తమకు తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఇలా చేయడం వల్ల 2014-19 మధ్య బీజేపీ విషయంలో అనుసరించిన విధానమే పవన్ పార్టీపై అవలంబించాలని భావిస్తున్నారంటున్నారు. 2014-19 మధ్య ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ చంద్రబాబుపైనే దాడి చేసిన వైసీపీ… బీజేపీతో స్నేహం పెంచుకోగలిగింది.బహిరంగంగా ఎక్కడా ఆ పార్టీతో మితృత్వం నెరపకపోయినా…. 2019-24 మధ్య బీజేపీ సహకారంతో ప్రభుత్వాన్ని నడపగలిగిందంటున్నారు. ఇప్పుడు కూడా పవన్‌తో స్నేహం లేకపోయినా, శత్రుత్వం పెంచుకోకూడదని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. వైసీపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది చూడాల్సివుంది.
- Advertisement -