హైదరాబాద్, నవంబ్ 22, (వాయిస్ టుడే): తెలంగాణ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారా..? కాంగ్రెస్‌కు బ్రేకులు వేసేందుకు కేసీఆర్ రప్పించారా..? ఇప్పుడు ఇదే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తిగా మారింది. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవేళ కేసీఆర్ అలర్ట్ అయ్యారు. మిగిలిన 9 రోజుల కార్యాచరణపై పీకేతో చర్చించినట్లు సమాచారం. పీకే-కేసీఆర్ మంత్రాంగం ఫలిస్తుందా లేదా అనేదే ఇప్పుడు బిగ్ డిబేట్. తెలంగాణలో ఎన్నికల వేడి పీక్స్‌కు చేరింది. పోటీ మొత్తం అధికార బీఆర్ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. మరో నాలుగు రాష్ట్రాలు కూడా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ.. అక్కడ తెలంగాణ స్థాయిలో హీట్ కనిపించడం లేదు. కర్నాటకలో స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. అదే జోష్‌ను తెలంగాణలో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే పట్టు వదలకుండా అన్ని ప్రయత్నాలు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా అధికారం నిలబెట్టుకునేందుకు శతవిధాలా కృషి చేస్తోంది. దేశంలో పేరుగాంచిన పొలిటికల్ స్ట్రాటజిస్టులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.పొలిటికల్ స్ట్రాటజిస్టులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ట్వీట్లు చేస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తోంది. చివరి క్షణం వరకు తగ్గేదేలే అన్నట్లుగా కార్యకర్తలు పనిచేయాలని కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త గురురాజ్ అంజన్ తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఓ సెన్సేషనల్ ట్వీట్ చేశారు. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌తో నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారని గురురాజ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపుగా మూడు గంటల పాటు చర్చలు జరిపినట్లు గురురాజ్ ట్వీట్ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ వచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికతో అలర్ట్ అయిన సీఎం కేసీఆర్ ప్రశాంత్ కిషోర్‌కు కబురుపెట్టారని గురురాజ్ అంజన్ చెప్పుకొచ్చారు. రానున్న 9 రోజుల కార్యాచరణపై ప్రశాంత్ కిషోర్‌తో సీఎం కేసీఆర్ చర్చించి సలహాలు తీసుకున్నట్లు గురురాజ్ ట్వీట్ చేశారు. అంతేకాదు 2024 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ హైకమాండ్‌తో ప్రశాంత్ కిషోర్ టచ్‌లో ఉన్నట్లు తనవద్ద సమాచారం ఉన్నట్లు గురురాజ్ చెప్పుకొచ్చారు.గతంలో అంటే 2019 లోక్‌సభ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ బీజేపీ, శివసేన పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారని గుర్తుచేశారు. అయితే ఒకవేళ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే ప్రశాంత్ కిషోర్ బాధ్యత తీసుకుంటారా అని గురురాజ్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.