మంథని నూతన మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమ
-మంథని మున్సిపాలిటీ హస్తగతం
-వైస్ చైర్మన్ గా శ్రీపతి బానయ్య ఏకగ్రీవ ఎన్నిక
-బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు
మంథని
ఎంతో ఉత్కంఠ మధ్య దాదాపు రెండు నెలలు కొనసాగిన మంథని మున్సిపల్ చైర్ పర్సన్
అవిశ్వస రాజకీయాలకు, నూతన పాలక మండలి ఎన్నికకు నేడు తెరపడింది. మంథని మున్సిపాలిటీ హస్త గతమైంది.
మంథని మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండ్రు రమ, వైస్ చైర్మన్ గా శ్రీపతి బానయ్య లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మంథని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారిచే నియమించబడిన ఆధీకృత అధికారి వి.హనుమ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. గత నెల 16న బిఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్ల పై అవిశ్వాస తీర్మానం పెట్టి తొలగించారు. మున్సిపల్ కార్యాలయంలో ఈ ఎన్నికకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మంథని మున్సిపల్ లో మొత్తం 13 వార్డు కౌన్సిలర్లు ఉండగా, 9 మంది కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెండ్రు రమను కౌన్సిలర్లు చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. అనంతరం చైర్ పర్సన్ ఎన్నికకు గాను 13 వ వార్డు కౌన్సిలర్
పెండ్రి రమ పేరును ఒకటవ వార్డు కౌన్సిలర్ గుండా విజయ లక్ష్మి చైర్ పర్సన్ గా ప్రతిపాదించగా 12వ వార్డు కౌన్సిలర్ వేముల లక్ష్మి బలపర్చాగా పెండ్రి రమ మంథని మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా ఏకగ్రీవముగా ఎన్నికయ్యారు. తదుపరి వైస్ చైర్ పర్సన్ ఎన్నికకు గాను పదవ వార్డ్ కౌన్సిలర్ శ్రీపతి బానయ్య ను 9వ వార్డు కౌన్సిలర్ చోపకట్ల హనుమంత రావు వైస్ చైర్ పర్సన్ గా ప్రతిపాదించగా 11వ వార్డు కౌన్సిలర్ వడ్లకొండ రవి బలపరచగా శ్రీపతి బానయ్య మంథని మున్సిపాలిటీ వైస్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవముగా ఎన్నికయ్యారు. ఎన్నికైన చైర్పర్సన్ పెండ్రు రమ, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య లతో మంథని ఆర్డిఓ ఎన్నికల అధికారి వి హనుమానాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ ఎన్నికలలో కౌన్సిల్ సభ్యులు గుండా విజయ లక్ష్మి, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర, కొట్టే పద్మ, చొప్పకట్ల హనుమత రావు, వడ్లకొండ రవి, వేముల లక్ష్మి లు హాజరైనారు. ప్రమాణ స్వీకార అనంతరం కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.