రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తుంది: ఆదం సంతోష్
సికింద్రాబాద్, అక్టోబర్ 31 (వాయిస్ టుడే ప్రతినిధి): రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా నడుస్తుందని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదం సంతోష్ అన్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గం బౌద్దనాగర్ డివిజన్ లో ఆదం సంతోష్ కుమార్ మంగళవారం పాదయాత్ర చేపట్టారు. డివిజన్ లోని అంబర్ నగర్, లలితా నగర్, కౌసర్ మసీద్, వారసి గూడ, బౌధ్ధ నగర్ ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఆదo సంతోష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్లుగా ప్రజా సమస్యలు పరిష్కించని బీఆర్ ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు ఓటు అడిగే హక్కు ఉందా అని ఆయన ప్రశ్నించారు. సికింద్రాబాద్ నియోజక వర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని తెలిపారు. సికింద్రాబాద్ లో బస్తీ పోరు కార్యక్రమం చేపట్టామని, ప్రజలు బీ ఆర్ ఎస్ పాలనలో విసుగెత్తారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గ ప్రజలు, రైల్వే ఉద్యోగులు, కార్మికులు నా బలం బలగం అని పేర్కొన్నారు. అడ్డగుట్ట లో 50 పడకల ఆసుపత్రి ఏమైందని ప్రశ్నించారు. మానికేశ్వర్ నగర్ లో ఆసుపత్రి నిర్మాణం కోసం స్థానికులు 120 రోజులు రిలే దీక్షలు చేసినా స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పట్టించుకోలేదని మండిపడ్డారు. సికింద్రాబాద్ లో ఏ గడప తట్టినా ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ ను గెలిపిస్తామని అంటున్నారని వెల్లడించారు.



