ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్లతో ప్రజలు మోసపోవద్దు
సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్.
People should not be fooled by fake shopping websites, says Pathikonda Rural CI Puli Shekhar Goud.
పత్తికొండ/తుగ్గలి:
ఫేక్ షాపింగ్ వెబ్ సైట్లతో మోసపోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్ తెలియజేశారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో ఆయన ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సిఐ పులిశేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఆన్లైన్ షాపింగ్ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేసే సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలియజేశారు.కొంతమంది సైబర్ నేరగాళ్లు ప్రసిద్ధి చెందిన కంపెనీల పేర్లతో పోలి ఉండే వెబ్‌సైట్లు రూపొందించి,భారీ డిస్కౌంట్లు,ప్రత్యేక ఆఫర్లు,తక్కువ ధరలకు ఎలక్ట్రానిక్ వస్తువులు,మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.ఆ వెబ్‌సైట్ల ద్వారా ముందస్తు చెల్లింపులు తీసుకుని తర్వాత వస్తువులు పంపకుండా మోసం చేస్తున్నట్లు గుర్తించామని ఆయన ప్రజలకు తెలియజేశారు.ఈ సందర్భంగా సిఐ ప్రజల కొరకు పలు ముఖ్యమైన సూచనలను తెలియజేశారు.అందులో ముఖ్యంగా అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే వస్తువులను కొనుగోళ్లు చేయాలని,
వెబ్‌సైట్ నందు యుఆర్ఎల్ సరిగా ఉందో లేదో పరిశీలించాలని,అతి తక్కువ ధరలకు వస్తువులు అందిస్తామని చెప్పే ప్రకటనలను ప్రజలు నమ్మకూడదని,బ్యాంక్ వివరాలు,కార్డ్ వివరాలు మరియు ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ఉండాలని,సాధ్యమైనంత వరకు “క్యాష్ ఆన్ డెలివరీ”ఎంపికను ఉపయోగించాలని,ఆన్లైన్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు తెలియజేశారు. ప్రజలు వెంటనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.ప్రజల సహకారంతోనే సైబర్ నేరాలను అరికట్టగలమని పత్తికొండ రూరల్ సీఐ పులి శేఖర్ గౌడ్ తెలియజేశారు.



