ప్రజల సమస్యే మా ప్రధాన యజెండా
People’s problem is our main agenda
సిసి రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,
ప్రజల సమస్యే తమ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని నన్నయ యూనివర్సిటీ నుంచి ఎన్ హెచ్ 16 అండర్ పాస్ వరకు వెళ్లే సిసి రోడ్డు నిర్మాణం, ఏరియా ఆసుపత్రి తూర్పు గేటు సిసి రోడ్, అగ్గిపెట్టెల కంపెనీ వద్ద సిసి రోడ్డు నిర్మాణాలకు శుక్రవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం పది వేల మంది విద్యార్థులు గణేష్ నగర్ రహదారి గుండా రాకపోకలు సాగిస్తారన్నారనీ వారందరి ఆకాంక్ష మేరకు ఈ రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది తమ పొలాల వద్దకు ఇక్కడ రహదారి నిర్మించాలని ప్రయత్నించారన్నారు. తాను మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలోనే ఈ రహదారిని మంజూరు చేయించామని గుర్తు చేశారు. అయితే తాను గతంలో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న సమయంలో అప్పుడే జిల్లా పరిషత్ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు సహకారంతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేసినా అప్పటికే ఎన్నికలు రావడంతో రోడ్డు నిర్మాణం నిలిచిపోయిందన్నారు.ఈ రహదారికి కొండలమ్మ ఆలయం, ఎస్వీఆర్ సర్కిల్ వరకు అవుట్ లెట్ నిర్మిస్తామన్నారు. పట్టణ ప్రజలకు మూడు పూటల నీరందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారులను ఆక్రమించవద్దని, వ్యాపారులు సహకరించాలని కోరారు. త్వరలోనే తాడేపల్లిగూడెంకు క్రికెట్ స్టేడియం మంజూరు కాబోతుందన్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి, బీజేపీ నేత ఈతకోట తాతాజీ, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి మురళీ కృష్ణ, కాళ్ళ గోపి, గురుజూ సూరిబాబు, డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.