మళ్లీ ముద్రగడతో రాజకీయం
కాకినాడ, ఫిబ్రవరి 14, (వాయిస్ టుడే )
Politics with a new twist
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతల్లో ఒక కొత్త వివాదం ప్రారంభం అయ్యింది. ముద్రగడ పద్మనాభం కు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడంపై ఇప్పుడు ఆ సామాజిక వర్గం నేతలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముద్రగడ రాజకీయ నిర్ణయాలు బాగుండవని.. ఆయనను నమ్ముకొని రాజకీయాలు చేయడం అంత మంచిది కాదని వైసీపీ కాపు నేతలు చెబుతున్నారు. ఇటీవల అంబటి రాంబాబు ఎపిసోడ్లో ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం పై కాపు నేతలు ఆగ్రహంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కాపు నేతలకు అన్యాయం చేసిందంటూ చెబుతూ ఆయన రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. అయితే అది కూటమి ప్రభుత్వం కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే సెగలు రేపినట్లు వార్తలు వచ్చాయి. అనవసరంగా ముద్రగడ పద్మనాభం ను హైలెట్ చేయడం పగదని సొంత పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి వైఖరిపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.గడిచిన ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం తన కుమారుడితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఆయన జనసేనకు వెళ్తారని ప్రచారం నడిచింది. అయితే ఆయనతో మేలు కంటే కీడు అధికమని పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సూచించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే పవన్ కళ్యాణ్ సైతం వెనక్కి తగ్గారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ను ఓడించడంతోపాటు జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేస్తానని శపధం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని కూడా సవాల్ చేశారు. అలా ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని ప్రకటన చేశారు. అయితే ఆయన మాటలను గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం అస్సలు పట్టించుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ విషయంలో ముద్రగడ రెచ్చగొట్టిన వ్యాఖ్యలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులను దూరం చేశాయని ఆ సామాజిక వర్గ నేతలు భావించారు. ఆ ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైంది. కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభంను ముందు పెట్టి రాజకీయం చేయడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది.వాస్తవానికి ముద్రగడ పద్మనాభం 1989 లోనే చివరిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారు. 1995లో ప్రత్తిపాడునియోజకవర్గంలో ఆయన ఓడిపోవడంతో తిరిగి ఆ నియోజకవర్గ వైపు చూడనని తేల్చి చెప్పారు. 2009లో పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓటమి చవి చూసారు. తరచూ అభిప్రాయాలు మార్చుకోవడం, అన్ని పార్టీల నాయకత్వాలతో విభేదాలు ఏర్పడడం వంటివి ముద్రగడ పద్మనాభం కు మైనస్ గా మారాయి. ఆయన ద్వారా కాపులను ఆకర్షించాలన్న ప్రయత్నం సరి కాదన్నది వైసీపీ నేతల వాదన. తాజాగా అంబటి రాంబాబు ఎపిసోడ్లో ప్రభుత్వానికి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన హై కమాండ్ ఆదేశాలు లేనిదే లేఖ రాయరు. అటువంటిది వంగవీటి మోహన్ రంగా, ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబు తదితరులను టిడిపి వేధించిందని లేఖ రాశారు ఘాటుగా. అయితే దీని ద్వారా లాభం కంటే నష్టమే అధికమని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపులు మరింత దూరం జరుగుతారు అన్నది వారి భయం.
తగ్గేదెలా అంటున్న అంబటి
మాజీ మంత్రి అంబటి రాంబాబు పశ్చాత్తాప పడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అయితే అంబటి రాంబాబును అభినందించాల్సింది పోయి అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఏదో ఆవేశంతో అన్న మాటలను ఆయన వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పారని.. అటువంటి వ్యక్తిని దండించడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి అంటూ మాట్లాడారు. అంబటి జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కూడా.. రాజకీయ అనుభవం ఉన్న నేను ఎవరో రచ్చగొడితే.. హుందాగా ప్రవర్తించాల్సిన నేను ఆవేశంతో నోరు జారాను. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలా మాట్లాడడం తప్పి అని అన్నారని చెప్పుకొచ్చారు.. దీంతో అంబటి రాంబాబు లో బ్రహ్మాండమైన మార్పు వచ్చిందని.. ఆయన పశ్చాత్తాప పడుతున్నారని అంతా భావించారు. కానీ నిన్న మళ్ళీ రిమాండ్ కు తరలించే క్రమంలో అంబటి రాంబాబు హావభావాలు చూస్తే ఒక నిర్ణయానికి రావచ్చు. ఆయన పశ్చాత్తాప పడే రకం కాదని కూడా తేలిపోయింది.అంబటి రాంబాబు అయినా.. ఇంకొకరు అయినా వైసీపీలో ఒక స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరించి కామెంట్స్ చేస్తారు. అక్కడ ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం వ్యక్తం చేసే వారికి చోటు ఉండదు. అలా ఆశించలేము కూడా. అటువంటిది అంబటి రాంబాబు పశ్చాత్తాప పడ్డారు అంటే ఏమనుకోవాలి. నిన్ననే గుంటూరు సివిల్ జడ్జ్ కోర్టుకి వ్యానులో తీసుకు వచ్చినప్పుడు అక్కడ తనకోసం ఎదురుచూస్తున్న అనుచరులు, మీడియా ప్రతినిధులను చూసి గడ్డం కింద నుంచి చెయ్యి తిప్పుతూ.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాదిరిగా తగ్గేదేలే అని సైగ చేశారు. అది చూసి ఆయన అనుచరులు కూడా ఉత్సాహంగా రప్పా రప్పా అంటూ నినాదాలు చేశారు. పార్టీ డిఎన్ఏ లోనే అది నిండిపోయింది. అటువంటప్పుడు అంబటి రాంబాబు పశ్చాత్తాప పడతారని.. పడ్డారని అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదు అని అర్థమైంది. అరెస్టుకు ముందే అంబటి రాంబాబు చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు పై కామెంట్స్ చేసే క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నన్ను అరెస్టు చేసుకుంటారా చేసుకోండి. ఇక్కడే ఉన్నా. అరెస్టు చేస్తే బెయిల్ కూడా అడగను. ఎంత కాలమైనా జైల్లో ఉంటానని కూడా చెప్పేశారు. కానీ ఇప్పుడు ఆయన అనుకున్న మాదిరిగానే జైలు మీద జైలుకు తిరుగుతూనే ఉన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయన ముఖంలో పశ్చాత్తాపం కాదు కదా.. విపరీతమైన కోపం కనిపిస్తోంది.



