
హైదరాబాద్ నవంబర్ 30: చెదురుముదురు సంఘటనలు మినహా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 5 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రజాస్వామ్య పండుగలో సాధారణ ఓటర్లతో పాటు సెలబ్రిటీలూ ఓటేసేందుకు పోటెత్తారు. సాధారణ పౌరుల్లా క్యూలో నిల్చొని మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,26,18,205 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.




