కాంగ్రెస్ ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా…
హుస్నాబాద్ లో సతీషన్నదే గెలుపు
అధికారంలో ఉన్నప్పుడు ఏం వెలగబెట్టారు?
పొన్నంపై రాజ్యలక్ష్మి ఫైర్
హుస్నాబాద్, నవంబర్ 11: అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ హుస్నాబాద్ గురించి మాట్లాడని మాజీ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఎన్నికల వేళ మొసలి కన్నీరు కారుస్తున్నారని బీ ఆర్ ఎస్ మహిళా నేత, నేషనల్ లేబర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి విమర్శించారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పొన్నం పై నిప్పులు చెరిగారు. హుస్నాబాద్ అభివృద్ధి కోసం నిరంతరం పరితపించే ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై విమర్శలు చేసే నైతిక అర్హత పొన్నం కు లేవని, కరీంనగర్ నుండి పారిపోయి హుస్నాబాద్ కు పొన్నం వచ్చారని, ఇక్కడి నుండి ఎన్నికల తర్వాత బిస్తరు సర్దుకుని అయన కరీంనగర్ కు పలాయనం చిత్తగించడం ఖాయమని ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పాలనలో గౌరవెల్లి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని, ఎల్లమ్మ చెరువు ను, గండి మహాసముద్రం, శనిగరం ప్రాజెక్టును, సింగరాయ ప్రాజెక్టును ను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో తెలిసేది కాదని, తాగునీటి కోసం ప్రజలు, సాగునీటి కోసం రైతులు అల్లాడిన విషయం వాస్తవం కదా? అని ఆమె ప్రశ్నించారు. నేడు హుస్నాబాద్ నియోజకవర్గం గోదావరి జలాలతో సస్యశ్యామలం అయిన విషయాన్ని పొన్నం జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల విషయంలో నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన ఘనత ఎమ్మెల్యేదన్నారు.
దేనికి చార్జిషీట్?
దేశంలోనే సతీష్ కుమార్ లాంటి ఎమ్మెల్యే లేరని, అయన నీతి, నిజాయితీకి మారుపేరని, ప్రజలతో మమేకమై పనిచేశారని బీ ఆర్ ఎస్ మహిళానేత దండుగుల రాజ్యలక్ష్మి అన్నారు. స్కాముల పార్టీ అయిన కాంగ్రెస్ లో ఉన్న పొన్నం ప్రభాకర్ సతీష్ కుమార్ పై ఛార్జి షీట్ పేరుతొ కరపత్రం ముద్రించడం అయన దివాలాకోరు రాజకీయాలకు నిదర్శనం అని మండిపడ్డారు. వెంటనే పొన్నం ఈ విషయమై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మీ పార్టీ నేతల్లా… సతీష్ కుమార్ కుంభకోణాలు చేసి కోట్లకు కోట్లు దిగమింగారా? లేక నేరం చేసారా? ఎందుకు చార్జిషీట్ అని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఛార్జి షీట్ వేసి పదేళ్లు అధికారానికి దూరంగా ఉంచినా వారికి బుద్ది రావడం లేదని, జ్ఞానోదయం కావడం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారో.. ఏం చేస్తారో.. చెప్పి ఓట్లు అడగాలని, కానీ మచ్చలేని నాయకునిపై చార్జిషీట్ పేరుతో కరపత్రాలు ముద్రించడం.. వారి వికృత రాజకీయ క్రీడకు పరాకాష్ట అని అన్నారు. ప్రజలు పొన్నం తీరును గమనిస్తున్నారని, నిన్నటి వరకు హుస్నాబాద్ ప్రశాంతంగా ఉండేదని, పొన్నం హుస్నాబాద్ రాజకీయాలను కలుషితం చేస్తున్నారని, అయన ఇకనైనా పద్దతి మార్చుకోవాలని ఆమె హితవు పలికారు.



