రోజుకు 15 కోట్ల పౌల్ట్రీ వ్యాపారం నష్టం
హైదరాబాద్, ఏప్రిల్ 2, (వాయిస్ టుడే )
హైదరాబాద్ మహానగరంలో చికెన్ ప్రియులకు పెద్ద షాక్ తగిలింది. నగరంవ్యాప్తంగా వందలాది చికెన్ షాపులు స్వచ్ఛందంగా మూతపడటంతో మాంసం విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లోనూ కిటకిటలాడే చికెన్ సెంటర్లు వెలవెలబోవడానికి ప్రధాన కారణం రిటైల్ వ్యాపారులకు, హోల్‌సేల్ సరఫరాదారులకు మధ్య తలెత్తిన మార్జిన్ వివాదం . తమకు వస్తున్న లాభం నామమాత్రంగా ఉందని, పెరిగిన ఖర్చులకు అనుగుణంగా మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని రిటైలర్లు సమ్మెకు దిగారు.ఈ వివాదానికి ప్రధాన కేంద్రం చికెన్ విక్రయాలపై వచ్చే కమిషన్. ప్రస్తుతం బాయిలర్ కంపెనీలు రిటైల్ షాపుల యజమానులకు కిలోకు కేవలం రూ. 5 నుండి రూ. 7 వరకు మాత్రమే మార్జిన్ ఇస్తున్నాయి. అయితే, గత కొన్నేళ్లుగా షాపుల అద్దెలు, కరెంట్ బిల్లులు, పనివారి జీతాలు, మున్సిపల్ పన్నులు భారీగా పెరిగాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు రూ. 15 నుండి రూ. 20 మార్జిన్ ఇస్తేనే తాము బతకగలమని, లేదంటే నష్టాల్లో కూరుకుపోతామని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గ్రేటర్ చికెన్ మర్చంట్స్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. బాయిలర్ చికెన్ కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి ధరలను నియంత్రిస్తున్నాయని, తక్కువ మార్జిన్‌తో చిన్న వ్యాపారుల పొట్ట కొడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. చికెన్ ధరలు పెరిగినప్పుడల్లా వినియోగదారుల నుంచి విమర్శలు ఎదుర్కొనేది తామేనని, కానీ అసలైన లాభం మాత్రం పెద్ద కంపెనీలకే వెళ్తోందని రిటైలర్లు వాదిస్తున్నారు. ఈ మార్జిన్ పెంచే వరకు షాపులు తెరిచే ప్రసక్తే లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. సమ్మె కారణంగా ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు సుమారు రూ. 10 కోట్ల నుండి రూ. 15 కోట్ల వరకు వ్యాపారం దెబ్బతింటుందని అంచనా. కేవలం మాంసం విక్రయాలే కాకుండా, చికెన్‌పై ఆధారపడిన హోటళ్లు, రెస్టారెంట్లు ,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడింది. హోటల్ యజమానులు అధిక ధర చెల్లించి బయటి జిల్లాల నుండి చికెన్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిఈ సమ్మె ఎంతకాలం కొనసాగుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కంపెనీ ప్రతినిధులు , రిటైలర్ల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ, మార్జిన్ పెంపు విషయంలో ఇంకా ఒక స్పష్టత రాలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించాలని అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు కోరుతున్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే, ఈ సమ్మె మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది



