పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట: డీజీపీ సి.వి. ఆనంద్
Priority Given to Police Personnel Welfare: DGP C.V. Anand
వెల్ఫేర్, ఆరోగ్య భద్రత పథకాలపై సమగ్ర సమీక్ష – ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు
హైదరాబాద్, జూలై 20 (వాయిస్ టుడే):
తెలంగాణ పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆరోగ్య భద్రత (Arogya Bhadratha) విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పోలీసు పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు, మెరిటోరియస్ స్కాలర్షిప్లు, జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
సిబ్బందికి వివాహ, వైద్య, విద్యా రుణాలు, అదనపు కార్పస్ ఇన్సూరెన్స్, వివిధ గ్రాంట్లు వంటి పథకాల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
ఆరోగ్య భద్రత పథకం ద్వారా వేలాది మందికి వైద్య సేవలు
2025లో ఆరోగ్య భద్రత పథకం ద్వారా 33,126 మంది పోలీసు సిబ్బంది, కుటుంబ సభ్యులు చికిత్స పొందగా, 2026 జూన్ నాటికి 12,392 మంది లబ్ధి పొందినట్లు తెలిపారు. ఇందుకోసం 2025లో రూ.181.74 కోట్లు, 2026 జూన్ నాటికి రూ.73.61 కోట్లు వ్యయం చేసినట్లు వివరించారు.
ప్రమాద బీమాతో కుటుంబాలకు ఆర్థిక రక్షణ
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైల వరకు రూ.5 లక్షలు, ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు రూ.10 లక్షలు, డీఎస్పీలకు రూ.15 లక్షలు, ఐపీఎస్ అధికారులకు రూ.25 లక్షల బీమా రక్షణ అందిస్తున్నట్లు డీజీపీ తెలిపారు.
సంక్షేమ పథకాల దుర్వినియోగం సహించం
సంక్షేమ పథకాలను వ్యాపార దందాగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ హెచ్చరించారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే వేలాది మంది పోలీసు కుటుంబాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.
పోలీసు పిల్లల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం
పోలీసు క్యాంటీన్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్, పోలీసు పిల్లల విద్య, సివిల్స్, గ్రూప్స్ కోచింగ్, స్కాలర్షిప్లు, వివాహ సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు.
పారదర్శకతకు డిజిటలైజేషన్
సంక్షేమ, ఆరోగ్య భద్రత సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేసి, లబ్ధిదారుల వివరాలు, నిధుల వినియోగం, సేవల అమలును ఆన్లైన్లో నమోదు చేసే సమగ్ర వ్యవస్థను రూపొందించాలని డీజీపీ సూచించారు. హోదాల వారీగా వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల అద్దె విధానంలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.
తక్కువ వడ్డీతో రుణాలు
పోలీసు సిబ్బందికి ఓపెన్ ప్లాట్ రుణాలు 9%, గృహ రుణాలు 6.75%, వ్యక్తిగత రుణాలు రూ.5 లక్షల వరకు 11%, కుమార్తె వివాహానికి రూ.6 లక్షల వరకు, దేశీయ, విదేశీ ఉన్నత విద్యకు రూ.30 లక్షల వరకు తక్కువ వడ్డీతో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
సమావేశంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం. భగవత్, ఏడీజీ సంజయ్ జైన్, ఐజీలు, పోలీస్ వెల్ఫేర్, ఆరోగ్య భద్రత విభాగాల అధికారులు, తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డీజీపీ తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రతి పోలీసు కుటుంబానికి సంక్షేమం, భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.




