బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్

- Advertisement -

బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్

న్యూఢిల్లీ, మార్చి 30:వాయిస్ టుడే

Promises Made to BCs Must Be Fulfilled: MP Vaddiraju Ravichandra Demands
Promises Made to BCs Must Be Fulfilled: MP Vaddiraju Ravichandra Demands

దేశంలో 60 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు న్యాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్లు పూర్తవుతున్నా కూడా బీసీ కులాలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయాయని, దీనికి రాజకీయ వ్యవస్థనే ప్రధాన కారణమని విమర్శించారు.

సోమవారం న్యూఢిల్లీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీలకు 56 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటినీ అమలు చేయలేదని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరుకాపు, యాదవ, కుర్మ, రజక కులాలకు మంత్రివర్గంలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని విమర్శించారు.

బీసీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం ₹20 వేల కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాలనలో బీసీల అభ్యున్నతికి విశేష కృషి జరిగిందని గుర్తుచేశారు.

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ తాను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, చట్టసభల్లో మహిళలతో పాటు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం ఐకమత్యంతో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, బీజేపీ నాయకుడు ఉప్పు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular