- Advertisement -
26 రోజుల పాటు ప్రజా విజయోత్సవాలు
Public celebrations for 26 days
హైదరాబాద్, నవంబర్ 9, (వాయిస్ టుడే)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా.. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం… ఉప ముఖ్యమంత్రి భట్టి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమై.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపి… రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న మల్లు భట్టి విక్రమార్క.. ఏడాది పాలనలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. దేశంలోని మరే రాష్ట్రంలో లేని తీరుగా విప్లవాత్మక మర్పులకు శ్రీకారం చుట్టామని, అంచనాలకు మించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ విషయాల్ని ప్రజలందరి ముందు ఉంచేందుకు.. ఈ వేడుకల్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలను కలుపుకుని.. 26 రోజుల పాటు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నామన్న భట్టి విక్రమార్క, ఈ ఏడాదిలో ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా కార్యక్రమాల రూపకల్పన జరగాలని నిర్దేశించారు. ప్రభుత్వ గ్యారెంటీ పథకాలైన మహిళలకు ఆర్టీసీలో బస్సులో ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతో పాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పారు.ఇప్పటికే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో 50 వేల ప్రభుత్వ కొలువులు కల్పించామన్న భట్టి, రూ. 18 వేల కోట్ల వ్యవసాయ రూణాల్ని మాఫీ చేసామని, మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని చెప్పారు.భారత ప్రథమ ప్రధాని, పండిట్ జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు నాడు ఈ ఉత్సవాలను ప్రారంభిస్తామన్న భట్టి విక్రమార్క, రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల ముగింపు రోజైన డిసెంబర్ 9 న భాగ్యనగరంలో.. వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు చేస్తామని, ప్రత్యేక లేజర్ షో లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఆ రోజే గ్రూప్- 4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేయనున్నట్లు తెలిపారు. అదేరోజు… వివిధ శాఖల పాలసీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు.ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా.. పరిశ్రమల ఏర్పాటుకు నూతన ఒప్పందాలు కుదుర్చడం, స్పోర్ట్ యూనివర్సిటీకి శంకుస్థాపన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు భట్టి వివరించారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క… ఉస్మానియా ఆసుపత్రి.భవన నిర్మాణానికి శంకుస్థాపన సైతం ఉత్సవాల సమయంలోనే ఉండనున్నట్లు వెల్లడించారు. వీటిలో పాటే… రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం సహా.. శాంత్ర భద్రతల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తెలిపేలా… వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమాలకు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీకి.. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సహా.. రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.
- Advertisement -