గింజ కటింగ్ లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు
Purchases of rice grain without grain cutting
-మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్
మంథని
గింజ కటింగ్ లేకుండా వరి ధాన్యం కేంద్రాల్లో కొనుగోళ్లు జరుపుతున్నామని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని పోతారం, ఖాన్ సాయిపేట్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతుల సౌకర్యార్థం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 17శాతం తేమ కలిగిన ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరలను పొందాలని సూచించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దనే ఉద్దేశంతో ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో కేంద్రాలను సకాలంలో ప్రారంభించుకున్నామని అన్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నప్పుడు రైతుల బాధలకు చలించి సన్న వడ్లకు బోనస్ ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఖాతాల్లో రూ.500బోనస్ జమ చేస్తుండటం పట్ల రైతుల్లో ఎనలేని సంతోషం వ్యక్తమవుతుందని అన్నారు. కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు సహకరిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఇతర అధికార యంత్రాంగం, రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సంఘ డైరెక్టర్లు పెద్దిరాజు ప్రభాకర్, దాసరి లక్ష్మీ-మొండయ్య, ఉడుత మాధవి-పర్వతాల్ యాదవ్, నాయకులు ఎడ్ల సత్యనారాయణ, జాగిరి సదానందం, దాసరి గట్టయ్య, కారెంగుల తిరుపతి, మంథని లింగయ్య, కుడుదుల కోటయ్య, మహదేవ్, దాసరి వెంకన్న, రైతులు, హమాలీలు, సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.