2023 తెలంగాణ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా అడ్డుకట్టవేయాలని నిర్ణయించుకుంది. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి.. తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఈ సోదాల్లో అధికారులు సైతం అవాక్కయ్యేలా నోట్ల కట్టలు, సొమ్ములు బయటపడుతున్నాయి. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 307కోట్ల సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఇందులో నగదు 105కోట్ల 58లక్షలు కాగా.. 13కోట్ల 58లక్షలు విలువ చేసే 72వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. ఇక పోలీసులు సీజ్ చేసిన బంగారం,వెండి, వజ్రాల విలువ 145కోట్ల 67లక్షలు అన్నట్లు ఈసీ అంచనా వేసింది. ఇవి కాకుండా 27కోట్ల విలువచేసే బియ్యం, చీరలు, ల్యాప్ టాప్స్, క్రీడా సామాగ్రి, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన 24గంటల్లోనే 18కోట్ల మేర సొత్తును స్వాధీనం చేసుకున్నారు.