*తక్కువ ధరకే నాణ్యమైన సరుకు – నూతన మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు*
Quality goods at low prices
ఏపీ లో మద్యం పాలసీ రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం జరిగింది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు భేటీ అయ్యింది. ఈ భేటీలో మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం విధానం పై క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరిపింది.
నూతన మద్యం పాలసీపై కసరత్తు
వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలను మంత్రి వర్గ ఉప సంఘం అధ్యయనం చేసింది. మద్యం దుకాణాలు, బార్ లు, బెవరేజెస్ కంపెనీల వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను క్యాబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారులు నివేదిక సైతం మంత్రులు పరిశీలించారు. అదేవిధంగా మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలనే యోచనలో కేబినెట్ సబ్ కమిటీ ఉంది. ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది.
తక్కువ ధరకు నాణ్యమైన మద్యం
మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందన్నారు. కేవలం సొంత ఆదాయం పెంచుకునేలా మద్య విధానం రూపొందించారని తెలిపారు. పూర్తిగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా మద్యం విధానం రూపొందించారని వెల్లడించారు. గత ప్రభుత్వ మద్యం విధానం వల్ల ప్రజలు ఆరోగ్యం దెబ్బతిందన్నారు. అందుకోసమే నూతన మద్యం విధాన రూపకల్పనపై తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం తెచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ఆరు రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన విధానం ఉంటుందని మంత్రి తెలిపారు.