- Advertisement -
మరో 3 రోజులు వానలే..వానలు
Rains for another 3 days..rains
హైదరాబాద్, డిసెంబర్ 3, (వాయిస్ టుడే)
ఫెంగల్ తుఫాన్ తీరం దాటింది. దీంతో ఉత్తర కోస్తాలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇక అన్ని పోర్టుల్లో జారీ చేసిన ప్రమాద హెచ్చరికలు ఉప సంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే తుఫాన్ ఎఫెక్ట్ తో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలు కాకినాడ, కోనసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.తుఫాన్ కారణంగా ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మూడురోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబర్ 6న శీతాకాలపు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో చలి తీవ్రత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సోమవారం నాడు హైదరాబాద్ లో 9.5 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదు అయింది.ఓవైపు తుఫాను ప్రభావంతో శుక్రవారం నుంచి తమిళనాడు రాష్ట్రం తో పాటు రాయలసీమ దక్షిణ కోస్తా ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే భారీ వర్షాలతో తిరుపతి అతలాకుతలమవుతోంది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచుతో చలి తీవ్రత పెరిగింది.అయితే పుదుచ్చేరి వద్ద తీరం దాటిన తుఫాన్ ఫెంగల్ తుఫానుతో చెన్నై అతలాకుతలం అయింది. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో చెన్నైని ముంచెత్తాయి. దీంతో ప్రధాన ప్రాంతాలు ఎటుచూసినా చెరువులు, నదుల్లా కనిపిస్తున్నాయి. టి.నగర్‌తో పాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. కొన్నిచోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు వీధుల్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. సహాయ చర్యల కోసం 30 వేల మంది పోలీసులు, 18 NDRF బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోనూ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఇదీలా ఉంటే.. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రైతులు విలవిల్లాడుతున్నారు. పంట చేతికి వచ్చే టైంలో తుఫాన్ ప్రభావం పంటకు అపార నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షాల ప్రభావంతో పలుచోట్ల వరి చేలు నేలనంటాయి.. పంట పొలాల్లోకి నీరు చేరింది. ఇక కొన్ని చోట్ల రైతులు పంట కోసి పెట్టుకున్నారు.. మిగిలిన పంట కోత కోయాల్సి ఉండగా.. కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చిన పంట కళ్ల ముందే పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుదన్నది చూడాలి.
- Advertisement -