రాజకీయ రొచ్చులోకి హీరోయిన్లు
తెలంగాణలో రకుల్.. తమిళంలో త్రిష
చెన్నై, ఫిబ్రవరి 17, (వాయిస్ టుడే )
Rakul in Telangana.. Trisha in Tamil
అమ్మ, ఆలి, చెల్లి… ఆడవాళ్ళ ప్రస్తావన లేకుండా తిట్టు చూద్దాం అని ఓ సినిమాలో విలన్‌కు సవాల్ విసురుతాడు హీరో. ఇప్పుడు రాజకీయ నాయకులకు సైతం ఈ విధమైన సవాల్ విసరాలేమో!? హీరోయిన్లను అడ్డు పెట్టుకుని విమర్శలు వద్దని, కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కావాలని! ఎందుకంటే… తెలంగాణలో రకుల్ ప్రీత్ సింగ్, తమిళనాడులో త్రిషను కొందరు నేతలు తమ స్వార్థం కోసం రాజకీయాల్లోకి లాగుతూ ప్రత్యర్థి పార్టీ నాయకులను టార్గెట్ చేశారు.త్రిషకు, రాజకీయాలకు సంబంధం లేదు. ప్రత్యేక్షంగా ఎవరికీ, ఏ రాజకీయ పార్టీకి త్రిష మద్దతు ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ, ఇప్పుడు తమిళ రాజకీయాలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. అందుకు కారణం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి రావడం.తమిళ రాజకీయాల్లో తాను ఒంటరిగా పోటీ చేస్తానని దళపతి విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో మిగతా రాజకీయ పార్టీలు ఆయనపై కత్తి కట్టాయి. అది సహజం. విజయ్ ‘జన నయగన్’ విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అందులో రాజకీయ కోణం చూస్తున్నారు కొందరు. నిజానిజాలు పక్కన పెడితే… విజయ్ వరకు సంబంధించిన వ్యవహారం అది.విజయ్ మీద విమర్శలు గుప్పించే క్రమంలో తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఓ అడుగు ముందుకేసి… త్రిష ఇంటి నుంచి విజయ్ బయటకు రావాలని కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై విజయ్ – త్రిష అభిమానులు, మహిళా సంఘాలు భగ్గుమన్నాయ్. తెలంగాణలోనూ ఈ విధమైన నీచ రాజకీయాలు ఇటీవల జరిగాయి.భారతీయ రాష్ట్ర సమితి నాయకుడు, కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (కేఆర్ఆర్)కు, కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్‌కు ముడి పెడుతూ విమర్శలు చేశారు, ఇంకా చేస్తున్నారు ప్రత్యర్థులు. ఆ మధ్య సమంత వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలా విమర్శలు చేసి తర్వాత క్షమాపణలు చెప్పారు కొండా సురేఖ. తెలంగాణ రాజకీయ విమర్శల్లో అప్పుడప్పుడూ సురేఖా వాణి పేరూ వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్య తమిళనాడు రాజకీయాల్లో ప్రదీప్ రంగనాథన్ ‘డ్రాగన్’, విశ్వక్ సేన్ ‘ఫంకీ’ హీరోయిన్ కయాదు లోహర్ పేరు హైలైట్ అయ్యింది. ఎందుకు? రాజకీయాల్లో హీరోయిన్లను టార్గెట్ చేయడం ఎందుకు? ఇప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి కాదు… సామాన్యుల నుంచి వ్యక్తం అవుతున్న ప్రశ్న. విలువలతో కూడిన రాజకీయాలను కొందరు ఎప్పుడో వదిలేశారు. కనీసం ఆడవాళ్లను తీసుకు రాకుండా రాజకీయాలు చేయలేరా? సినిమాల్లో విజయ్ – త్రిషది హిట్ పెయిర్. కొన్ని సినిమాలు చేసిన హీరో హీరోయిన్ల మధ్య పరిచయం ఉంటుంది. సినిమాల్లో ఉన్నట్టు బయట ఉంటారని విమర్శలు చేయడం ఎంత వరకు సబబు? అసలు రాజకీయాలతో సంబంధాలు లేని రకుల్ పేరు లాగడం ఎందుకు??తమిళనాడులో త్రిష… తెలంగాణలో రకుల్… రాజకీయాలకు సాఫ్ట్ టార్గెట్ కింద మారారు. సినిమాల్లో నటించడం, తమ పని ఏదో తాము చూసుకోవడం తప్ప ఈ తరహా రాజకీయ విమర్శలకు బదులు ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ మళ్ళీ వచ్చే రాజకీయ విమర్శలు అన్నిటికీ బదులు ఇవ్వవలసి ఉంటుంది. అందుకని, త్రిష – రకుల్ మౌనం వహిస్తున్నారు. విమర్శలను వాదిస్తున్నారు. దాంతో కొందరు రాజకీయ నాయకులు – వాళ్ళ అనుచరులకు చెందిన సోషల్ మీడియా ఖాతాల్లో హీరోయిన్లపై వ్యక్తిత్వ దాడి కొనసాగిస్తోంది. దీనికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది.



