గ్లోబల్ స్టార్, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ పుట్టినరోజు ఈరోజు. తన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు, తమ కుమార్తె క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
నిన్న సాయంత్రమే ఆయన తన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుండి తిరుమలకి వెళ్లారు.
రామ్ చరణ్ తన పుట్టినరోజు సందర్భంగా నేడు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవలో రామ్ చరణ్ దంపతులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఈ దంపతులకు ఆహ్వానం పలికి, స్వామి దర్శనానంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందించారు.
నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న రామ్ చరణ్ దంపతులు పద్మావతి నగర్ లోని ఫోనిక్స్ వెంకటేశ్వర నిలయంలో బస చేశారు. రెండు రోజుల నుంచి రామ్ చరణ్, చిరంజీవి తిరుమలకు వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన క్రమంలో రామ్ చరణ్ ను చూడడం కోసం భారీ స్థాయిలో అభిమానులు తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలకు రాంచరణ్ రావడంతో రాం చరణ్ తిరిగి వెళ్ళిపోయే వరకు అభిమానులు అతిథిగృహం వద్ద, అలాగే ఆలయం వద్ద ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. రామ్ చరణ్ కు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత రామ్ చరణ్ తొలిసారిగా తిరుమలకు వచ్చారు. అంతేకాదు బిడ్డ పుట్టిన తర్వాత తొలిసారిగా బిడ్డతో కలిసి రామ్ చరణ్, ఉపాసన వచ్చారు.ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన తర్వాత, ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేశారు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. రాం చరణ్ ఉపాసన దంపతులతో పాటు వారి పాప కూడా తిరుమలకు రావటంతో పాపను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అయితే క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్, ఉపాసన దంపతులు పాప కనిపించకుండా ఉపాసన చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. కవర్ చేసుకుంటూ క్లింకారను తీసుకువెళ్ళారు.