చిరంజీవి పేరుతోనే రావిపూడి అనిల్ సినిమా
హైదరాబాద్, మార్చి 27, ( వాయిస్ టుడే)
మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ మూవీ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మాస్ ప్రేక్షకులను అలరించే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా, ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ దశ పూర్తయిందని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవితో కథా చర్చలు పూర్తి కావడం, ఆయన సానుకూలంగా స్పందించడంతో చిత్ర యూనిట్ ఉత్సాహంగా ఉంది.అనిల్ రావిపూడి తన ట్వీట్‌లో, చిరంజీవి గారికి సినిమాలో తన పాత్ర అయిన ‘శంకర్ వరప్రసాద్’ను పరిచయం చేశానని, ఆయన కథను ప్రేమగా స్వీకరించి ఆసక్తిగా విన్నారని తెలిపారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి, చిరునవ్వుల పండగను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాకు ‘చిరు అనిల్’ ప్రాజెక్ట్ అనే పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సినిమాలో చిరంజీవి అసలు పేరు ‘శంకర వర ప్రసాద్’ను ప్రముఖంగా చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘శంకర్ దాదా MBBS’లో కూడా ఇదే పేరుతో ఆయన అలరించారు.ఈ చిత్రం చిరంజీవిని మళ్లీ పూర్తి స్థాయి మాస్, ఫన్ అవతారంలో చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక ట్రీట్‌గా ఉండనుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ .. చిరంజీవి స్పెషల్ మేనరిజమ్స్ కలగలిస్తే తెరపై ఎలాంటి వినోదం పండుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియో ఖరారు అయిన సంగతి తెలిసిందే.మ్యూజిక్ కు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నాలుగు పాటలు ఇప్పటికే కంపోజ్ అయ్యాయని సమాచారం. చిత్ర బృందం ప్రీ-ప్రొడక్షన్ పనులను ఎక్కడా ఆలస్యం చేయకుండా పూర్తి చేస్తోంది. మెగాస్టార్ తదుపరి చిత్రం ‘విశ్వంభర’ విడుదలైన వెంటనే ఈ కొత్త ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి సారించేలా మే నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. సంక్రాంతి సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని, అనిల్ రావిపూడి మెగాస్టార్‌తో కలిసి మరోసారి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎంపిక చేసేందుకు ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉగాది పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి, మెగాస్టార్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి ఒక పెద్ద వినోదాల విందును అందించడానికి రెడీ అవుతుంది