Monday, December 23, 2024

రవ్వంత రెడ్డే… రగిల్చాడు…

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 6, (వాయిస్ టుడే):  రేవంత్ రెడ్డిని….రవ్వంత రెడ్డి అంటూ తక్కువ చేశారు. రవ్వ కాదు.. అది అగ్గి రవ్వ అన్న విషయం అర్థమైంది. కేసీఆర్ స్టేచర్ కు సరిపోయే కేరక్టర్ అటువైపుందా అన్నారు. ఆ కొండను ఢీకొట్టిన కేరికేచర్ ఇదీ అని చూపించాడు. ఓ చిన్న చినుకై..  వానై… వరదై తొమ్మిదేళ్లుగా తెలంగాణను ఏలుతున్న రాజకీయ  కుటుంబాన్ని ముంచేసిన ఆ సునామీనే అనుముల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు.. జూబ్లిహిల్స్ కొండల్లో స్నేహితులతో కలిసి సరదాగా సైకిల్ రేసులు చేసేవారు. అందులో నెగ్గినప్పుడు మిత్రులంతా అభినందిస్తుంటే.. ఈ రేసే కాదు.. నేను ఈ రాష్ట్రానికి సీఎం రేసులో కూడా ఉంటా.. అది కూడా నెగ్గుతా అన్నరట రేవంత్ అప్పట్లో.. ఆయనకు నిజంగా అంత డిటర్మినేషన్ ఉందేమో…. అది దాదాపు నిజమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొండారెడ్డి పల్లె అనే  చిన్న ఊళ్లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఓ కుర్రాడు.. ఏకంగా కుంభస్థలాన్నే కొట్టాడు. తెలంగాణ గడ్డమీద కేసీఆర్ ను కొట్టేవారున్నారా అనే సందేహాలను పటాపంచలు చేశాడు. దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షలను అధికారంలో ఉండగా నెరవేర్చి..  అదే తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ అయ్యాడు.. ఇవాళ తెలంగాణ గడ్డా మీద కాంగ్రెస్ జెండా ఎగరేయగలుగుతోందంటే.. అది నిస్సందేహంగా రేవంత్ వల్లే అన్నది నిర్వివిదాంశం. ఎప్పుడూ ఓవర్ క్రౌడ్ తో నడిచే కాంగ్రెస్ రైలుబండిలో లీడర్లు, సీనియర్లు, సలహాదారాలకు కొదవేంలేదు. కొంతమంది ఈ విషయాన్ని పైకి ఒప్పుకోకపోవచ్చు గాక.. కానీ.. అంతర్గతంగా అందరూ అంగీకరించే విషయం రేవంత్. కాంగ్రెస్ హామీలు, కర్ణాటక ఎన్నికలు, రాహుల్ గాంధీ పర్యటనలు, ప్రభుత్వం వ్యతిరేకత, కేసీఆర్ కుటుంబంపై కోపం.. ఇలా కారణాలు చాలా ఉన్నాయి కానీ..వీటన్నింటినీ కలిపి కాంగ్రెస్ వైపు నడిపిన సారథి మాత్రం రేవంతే. కాంగ్రెస్ పార్టీకి ముందుగా సీఎంలను ప్రకటించే సాంప్రదాయం లేదు. ఓ చిన్న నాయకుడిగా రాజకీయ పయనం ప్రారంభించి అత్యంత బలసమైన స్థానానికి చేరిన లీడర్ గా రేవంత్ ప్రస్థానం మొత్తం ఆసక్తికరంగా ఉంటుంది. రేవంత్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. పార్టీ బ్యాకప్ లేదు. అసలతనెప్పుడూ అధికారపార్టీలో కూడా లేడు.  ముందు లీడర్ గా నిరూపించుకుని ఆ తర్వాత రాజకీయ పార్టీల్లో చేరాడు. ఓ విద్యార్థి నేతగా మొదలుపెట్టి ఇప్పుడు రాష్ట్రాధినేతగా ఎదిగారు. రాజకీయం మొత్తం పోరాటమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారపక్షంతో పోరాటం. పార్టీలో ఉన్నప్పుడు.. సొంతవాళ్లతో పోరాటం.. సమస్యలతో పోరాటం.. సీఎంతో పోరాటం. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఈ పోరాట పంథా అన్నదే వీడలేదు. అదే రేవంత్ ను ఆ స్థానంలో నిలబెట్టింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) కొండారెడ్డి పల్లె అనే చిన్న గ్రామంలో జన్మించిన రేవంత్ రెడ్డి ముందు ఏబీవీపీలో విద్యార్థి నాయకుడుగా ఉన్నారు.  2006లో  మిడ్జెల్ మండలం జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇండిపెండెంట్ గా రేవంత్ గెలవడం సంచలనంగా నిలిచింది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గెలిచిన వెంటనే నేరుగా వెళ్లి టీడీపీలో చేరారు. రేవంత్ స్పీడు, స్పీచ్ చూసి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆయన్ను ఎంకరేజ్ చేశారు. చాలా మంది సీనియర్ లీడర్లకన్నా బాగా ఎదిగారు. టీడీపీ అధికార ప్రతినిధిగా అప్పట్లో వైఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2009 ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి అప్పటికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గురునాథ్ రెడ్డిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.  2014లో మరోసారి కొడంగల్ నుంచి గెలిచి టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. తెలుగుదేశం శాసనసభాపక్ష నేతగా రేవంత్ కు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. కాంగ్రెస్ పెద్ద పార్టీ అయినప్పటికీ రేవంత్ ను ఎదుర్కొవడానికి అధికార పక్షం ఇబ్బంది పడేది. అనేక సార్లు ఆయన్ను సస్పెండ్ చేశారు. తెలంగాణ టీడీపీని బీఆర్ఎస్ ఖాళీ చేసేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 2017లో కాంగ్రెస్ లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా 2018 లో ఉన్నప్పటికీ అప్పటికి కాంగ్రెస్ లో పూర్తి ప్రాధాన్యం దక్కలేదు. ఆ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినా 2019లో మల్కాజగిరి ఎంపీగా గెలవడం రేవంత్ కు కలిసొచ్చింది. ఆ తర్వాత ఏకంగా టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యి అధిష్టానం వద్ద తన మాట నెగ్గేలా చేసుకున్నారు. రేవంత్ ఎంత దూకుడైన నేత అయినా కాంగ్రెస్ లో మాత్రం సంయమనం పాటించారు. మాటకు మాట.. చేతకు చేత అన్నట్లు ఉండే రేవంత్ కాంగ్రెస్ సీనియర్లు, సహచరులు తనపై చేసిన విమర్శలను కాచుకున్నారు. ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సీనియర్లు కామెంట్లు చేస్తే .. ఇంటికెళ్లి బ్రతిమాలారు. టీడీపీ వాళ్లకి పదవులిచ్చారు అంటే నిమిషాల్లో రాజీనామాలు చేయించారు. ఎవ్వరు ఎలా ఇబ్బందులు పెట్టాలి అని చూసినా .. తనదైన సమయం కోసం రేవంత్ ఎదురుచూశారు.కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనుకోని బలాన్నిచ్చాయి. కాంగ్రెస్ ఆరు హామీలు అస్త్రాలుగా మారాయి. రాహుల్ గాంధీ అడ లభించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో చెలరేగిపోయారు. అటు ప్రత్యర్థులపై ఎగ్రైసివ్ గా ఇటు పార్టీలో ప్రత్యర్థులకు అవకాశాలివ్వకుండా తనదైన శైలిలో ముందుకెళ్లారు. ఎంత మంది సీనియర్లున్నా.. ఓటమి భయంతో వారంతా తమ తమ నియోజకవర్గాలు కూడా కదల్లేని పరిస్థితి ఉంటే .. రేవంత్ ఒక్కడే దాదాపు 90 నియోజకవర్గాలు తిరిగాడు. కేసీఆర్ పై కామారెడ్డి లో నామినేషన్ వేసి సవాలు విసిరాడు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజానీకానికి విపరీతమైన అభిమానం. రాష్ట్రాన్ని సాధించిన ధీరుడిగా.. రాజకీయ దురంధరుడిగా కేసీఆర్ చరిష్మాను తట్టుకోగల నేత మరొకరులేరు అనుకుంటున్న తరుణంలో కేవలం కేసఆర్ ను మాత్రమే టార్గెట్ చేసి రేవంత్ పోరాటయోధుడిగా నిలిచారు. ఇందుకోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించారు. కేసీఆర్ తో సరిసమానమైన స్థాయి అనకపోయినా ..కేసీఆర్ కు తగిన ప్రత్యర్థి అన్న కీర్తిని సంపాదించారు. అందుకే తెలంగాణ సమాజం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు.. వారికి రేవంత్ కనిపించాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రయాణం మరో మలుపు తిరగబోతోంది. సహజంగానే దూకుడుగా ఉండే రేవంత్ పరిపాలనలో ఎలా ఉంటారో అన్న ఆసక్తి ఉంది. కాంగ్రెస్ వస్తే.. ఏం జరుగుతుంది.. రేవంత్ కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ బీఆర్ఎస్ ఎన్నికలకు ముందు చాలా ఆరోపణలు చేసింది. ఆ భయాలకు తగిన కారణాలు లేకపోలేదు. ఇప్పుడు అవన్నీ తప్పు నిరూపించాల్సిన బాధ్యత రేవంత్ దే. కొత్త బాధ్యతల్లో కూడా ఒదిగిపోయి తాను రాజకీయం చేయగలను.. పరిపాలకుడిగానూ నిరూపించుకోగలను చూపించాల్సిన బాధ్యత కూడా ఆయనదే. ఒక్కసారి అధికార పార్టీలో లేకుండా .. మంత్రిగా అనుభవం చూడకుండా… నేరుగా ప్రభుత్వాధినేత అవుతున్న కాంగ్రెస్ సారధి.. తెలంగాణ ప్రగతి రథసారధిగా మారతాడా లేదా అన్నది కాలం చెప్పాలి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్