కాంగ్రెస్ పాలనకు రిపరెండం…
హైదరాబాద్, ఫిబ్రవరి 5, (వాయిస్ టుడే )
Referendum on Congress rule…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, దూకుడు మీదున్న బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అగ్రనేతలను రంగంలోకి దించగా,
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం స్థానిక నేతలకే బాధ్యత వదిలేసింది. తెలంగాణలోని 123 మున్సిపల్ , 7 కార్పొరేషన్లకు జరుగుతున్న ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ తన పాలనకు ఒక రెఫరెండంగా
భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయించారు. పట్టణ ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లు కురిపిస్తూ, మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం
ద్వారా తన పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. కేడర్‌లో ఉత్సాహం నింపేలా ప్రతి మున్సిపాలిటీకి మంత్రులను ఇన్-ఛార్జులుగా నియమించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యేవేక్షిస్తున్నారు. బీజేపీ సైతం ఏమాత్రం
తగ్గడం లేదు. జాతీయ అధ్యక్షుడు స్వయంగా ప్రచారానికి వస్తుండటమే కాకుండా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. వీటికి అదనంగా, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్
కల్యాణ్ రెండు రోజుల పాటు తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనుండటం ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. జనసేన మద్దతుతో సెటిలర్ల ఓట్లను, యువత ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలన్నది
బీజేపీ వ్యూహం. ఇంతటి భారీ యంత్రాంగాన్ని దింపడం ద్వారా రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఆ పార్టీ పంపిస్తోంది.ఈ హడావుడి మధ్య బీఆర్ఎస్ తీరు రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
గతంలో ప్రతి చిన్న ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకునే అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఈసారి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతూ, క్షేత్రస్థాయి ప్రచార బాధ్యతలను
స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్-ఛార్జులకే వదిలేశారు. అభ్యర్థుల ఎంపిక కూడా వారికే ఇచ్చారు. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన స్తబ్దత నెలకొంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికలను లైట్ తీసుకోవడం వెనుక లోతైన
రాజకీయ కారణాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే, ఆ ఓటమి బాధ్యతను తమపై వేసుకోకుండా తప్పించుకోవడానికే అగ్రనేతలు దూరంగా ఉంటున్నారన్న వాదన
బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా.. ఫలితాలు బాగుంటే పార్టీ పుంజుకుందన్న ప్రచారం, తేడా వస్తే స్థానిక నేతల వైఫల్యంగా చూపించే వీలుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు
సమాచారం. అయితే, ఇది కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, బీజేపీ తన బలాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంటే.. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్సివ్
మోడ్‌లో కనిపిస్తోంది.



