మళ్లీ చేరికలు….
Rejoinders….
వరంగల్, ఆగస్టు 21,
దాదాపు పక్షం రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చారు. ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఆయన హైదరాబాద్ కు చేరుకుని వెంటనే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొన్నటి వరకూ చేరికలు నిలిచిపోయాయి. ఆషాఢమాసం కావడంతో చేరదామనుకున్న వారు కూడా మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక శ్రావణ మాసం వచ్చేసింది. మంచి ముహూర్తాలున్నాయి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విదేశాల నుంచి రావడంతో తిరిగి కండువాలు కప్పుకోవడం మొదలవుతుందన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతుంది. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలతో ట్ లోకి వెళ్లారని తెలిసింది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలు, పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా పార్టీని వదలి పెట్టారు. దీంతో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లు చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరో ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. వీరంతా విడతల వారీగా ఈ నెల 22వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న టాక్ వినపడుతుంది. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు వరసపెట్టి కాంగ్రెస్ లోకి వెళుతుండటం కొంత గులాబీ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టిక్కెట్లు ఇచ్చినా కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి మరీ గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ చేయడమేంటని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు కూడా రావని, టిక్కెట్ కోసం ఢిల్లీ చుట్టూ ప్రదిక్షిణలు చేయాలని కారు పార్టీ అగ్రనేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా రేవంత్ రెడ్డి మాటలను ఎమ్మెల్యేలు లెక్క చేయడం లేదు. మరో నాలుగేళ్లు అధికార పార్టీలో ఉండటమే మేలన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వచ్చినట్లు సమాచారం. అందుకోసమే పెద్దగా పదవులపై హామీలు ఇవ్వకున్నా జంప్ చేయడానికి సిద్ధపడుతున్నారు. నిజానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నేరుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. పార్టీని వీడతారని అనుమానం వచ్చిన ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశమై వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని, పార్టీ మారి ఇబ్బందులు పడవద్దని సుతిమెత్తంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా కేసీఆర్ మాటలు వారి చెవికెక్కడం లేదు. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది పార్టీని వీడితే తమను మానసికంగా దెబ్బకొట్టాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే బయటకు కనిపించకుండా వెళ్లేవారిని మనం ఆపలేమని, కొత్త నాయకత్వంపై దృష్టి సారించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఎంతకాలం ఆపుతామని ఆయన అన్నట్లు తెలిసింది. మొత్తం మీద మళ్లీ తెలంగాణలో చేరికలు ఊపందుకోనున్నాయి.