- Advertisement -
ఇసుక, లిక్కర్ లో జోక్యంపై ఆగ్రహం
Resentment of interference in sand, liquor
కాకినాడ, అక్టోబరు 18, (వాయిస్ టుడే)
ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఎమ్మెల్యేల వల్లే వస్తుంది. సంపాదన కోసం వారు నియోజకవర్గంలో ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకోవడం.. ప్రతి పని తమ కనుసన్నల్లో జరగాలని కోరుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. గత అనుభవాలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సారి రూటు మార్చారు. ఎమ్మెల్యేలను మొదటి నుంచి కట్టడి చేసి సరైన మార్గంలో వెళ్లేలా చేయాలనుకుంటున్నారు. అందుకే సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కేబినెట్ భేటీలోనూ అదే చెప్పారు. ప్రత్యేకంగా టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి అవే హెచ్చరికలు వినిపించబోతున్నారు. గత ప్రభుత్వం ఇసుక దోపిడికి పాల్పడిందని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. అందుకే తాము రాగానే ఉచిత ఇసుక పాలసీ ఇస్తామని హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఉచిత ఇసుక పాలసీ తెచ్చింది. కానీ చాలా చోట్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనికి కారణం ఎమ్మెల్యేల జోక్యమేనని ఆరోపణలు వచ్చాయి. తాజాగా లిక్కర్ పాలసీ విషయంలో కొంత మంది ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారని నివేదికలు చంద్రబాబుకు వచ్చాయి. సిండికేట్ అయ్యారని.. లాటరీల్లో దుకాణాలు వచ్చిన వారిని బెదిరించారని ఇలా పలు రకాలుగా చెప్పుకున్నారు. దీంతో చంద్రబాబు నేరుగా ఇంటలిజెన్స్ నుంచి నివేదికలు తెప్పించుకుని ఇలాంటి పనులు చేస్తున్న వారికి హెచ్చరిక సంకేతాలు పంపించారు. ఎమ్మెల్యేలు ఇలా అక్రమ సంపాదనకు అలవాటు పడకుండా చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొదట్లోనే వారిని అడ్డుకుంటే సమస్య ఉండదని అనుకుంటున్నారు. నిజానికి ఇసుక, లిక్కర్ అనేది ఎమ్మెల్యేలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటిగా ఉండేది. గత ప్రభుత్వంలో ఇది కేవలం పై స్థాయిలో ఉన్న వారికి మాత్రం ఆదాయవనరుగా మారిందని అందుకే వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని చెబుతారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పాత విధానాలే తీసుకు వచ్చినా నిజాయితీగా లిక్కర్ దుకాణాలను వేలంపాటలో దక్కించుకునే పర్వాలేదు కానీ దందాలు చేయాలనుకుంటే మాత్రం సాధ్యం కాదని సంకేతాలు పంపుతున్నారు. ఇలా ఎమ్మెల్యేలు లిక్కర్, ఇసుకల్లో పదే పదే జోక్యం చేసుకుంటే ప్రజా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు వారిని కట్టడి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు తమకు ఆదాయ మార్గాలేమిటని మథనపడే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాలు చేయాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. పార్టీ క్యాడర్ ను చూసుకోవాలి. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. మరి వీటికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందన్న ఆవేదన ఎమ్మెల్యేల్లో కనిపించే అవకాశం ఉంది. నిజాయితీగా వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వం తరపున పార్టీ నుంచి సహకారం అందుతుంది కానీ.. అక్రమ వ్యాపారాలకు సహకరించే ప్రశ్నే లేదని చంద్రబాబు స్పష్టం చేయనున్నారు.ఇందు కోసం టీడీపీ ఎల్పీ సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేలకు తన పాలసీని స్పష్టం చేయనున్నారు. గీత దాటిదే ఎవర్నీ వదిలేది లేదని హెచ్చరించే అవకాశం ఉంది.
- Advertisement -