స్వచ్ఛ ధనం – పచ్చ ధనం విజయవంతం చేయాలి
ప్రతి ఒక్కరూ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఘనపురం మండల కేంద్రంలో స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి,
Responsible to keep the surroundings clean
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. సోమవారం ఘనపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయితీ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మొక్కలు నాటి స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా మరుగుదొడ్డి నిర్మాణానికి, గ్రామపంచాయితీ ఆవరణలో సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామసభలో పాల్గొని విద్యార్థులతో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం నుండి గణపురం మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వరకు స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామాలలో, పట్టణాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. 5వ తేది నుండి ఈ నెల 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకునే విధంగా రోజు వారి కార్యచరణ ప్రకారం అధికారులు అన్ని మండలాలలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రతి ఇంట్లో కనీసం 6 మొక్కలు నాటాలని ఉచితంగా మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.
ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంకులను శుభ్రపరచాలని క్లోరోస్కోప్ ద్వారా త్రాగునీటి పరీక్షలు చేసి నాణ్యమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం కేవలం 5 రోజుల పాటు కాకుండా నిరంతరం కొనసాగే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ సమిష్టిగా బాధ్యతతో పని చేసినప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నరేష్, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో భాస్కర్, ఎస్ బి ఎం కో ఆర్డినేటర్ వెంకటేష్, మెడికల్ ఆఫీసర్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు ఉపాధ్యాయులు, మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.