హైదరాబాద్-విజయవాడ హైవేలో వాహనాల రాకపోకలు పునరుద్ధరణ
Restoration of vehicular traffic on Hyderabad-Vijayawada highway
రెండు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన మునేరు వరద ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మునేరుకు క్రమంగా వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో వాహనాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. పోలీసులు దగ్గరుండి ఒక్కొక్క వాహనాన్ని వరద దాటించి పంపిస్తున్నారు. విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు. ఆదివారం నుంచి హైవేపై ఎదురుచూస్తున్న వాహనదారులకు ఉపశమనం లభించింది. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు నిన్నటి వరకు మునేరు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిలిపివేసిన రాకపోకలను అధికారులు వరద తగ్గడంతో పరిస్థితిని పరిశీలించిన అధికారులు వాహనాలు వెళ్లేందుకు అనుమతించారు.
జాతీయ రహదారిపై భారీ ఎత్తున ప్రయాణికులు, వాహనదారులు వేచి చూశారు. ఎప్పుడెప్పుడు హైవేపై రాకపోకలు పునరుద్ధరిస్తారా అని ఎదురుచూశారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి బిహార్‌కు మృతదేహం తీసుకెళ్తున్న అంబులెన్స్ ఉదయం నుంచి ఐతవరం వద్ద ఆగిపోయింది. నందిగామ -మధిర రోడ్డుపై ఆదివారం నుంచి నిలిచిపోయిన రాకపోకలను ఇప్పటికే పునరుద్ధరించారు. వరద ఉద్ధృతికి నందిగామ నుంచి మధిర వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి నుంచి బిహార్‌కు మృతదేహం తీసుకెళ్తున్న అంబులెన్స్ ఉదయం నుంచి ఐతవరం వద్ద ఆగిపోయింది. ఇక్కడ ఆగిన వారందరికీ స్వచ్ఛంద సంస్థలు భోజనం ప్యాకెట్లు అందజేశాయి. ఇక నందిగామ-మధిర రోడ్డుపై ఆదివారం నుంచి నిలిచిపోయిన రాకపోకలను ఇప్పటికే పునరుద్ధరించారు. వరద ఉద్ధృతికి నందిగామ నుంచి మధిర వెళ్లే రోడ్డు కొట్టుకుపోయింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. నందిగామకు తాగునీరు అందించే పైపులైన్లు సైతం దెబ్బతినడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
గరికపాడు జాతీయ రహదారిపై తెగిన బ్రిడ్జి: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు పాలేటి వంతెన వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి ఒకవైపు తెగిపోయింది. పాలేరు వాగు ఉద్ధృతి కారణంగా రహదారి కోతకు గురైంది. ఈ ప్రాంతాన్ని జీఎంఆర్ ప్రతినిధులు పరిశీలించారు. రెండో వైపున హైదరాబాద్‌కు వాహనాల రాకపోకలను నిలిపివేసి వంతెన పటిష్టతను పరిశీలించారు. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు వెళ్లే మార్గంలో కోసుకుపోయిన బ్రిడ్జిని రెండు రోజుల్లో పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.