సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ముగ్గురితో కూడిన కమిటిని రేవంత్ రెడ్డి శనివారం ప్రకటించారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ భారీగా పోటీ ఉంది.
కాంగ్రెస్ ఇప్పటికే 13 మంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే పార్టీ ఉన్నవారికి కాదని.. పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంత మంది నేతలు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం లేదని మండిపడుతున్నారు. దీంతో టీపీసీసీ ఓ కమిటి వేయాలని నిర్ణయించింది. దాని ప్రకారమే కమిటీ వేశారు. అయితే 4 స్థానాలు మినహా అభ్యర్థులందరినీ ప్రకటించిన తర్వాత ఈ కమిటి ఎందుకని కొంత మంది ప్రశ్నిస్తున్నారు
పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్ గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి డాక్టర్ మల్లు రవి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్ షెట్కర్, మహబూబాబాద్(ఎస్టీ) నుంచి బలరామ్ నాయక్, మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డి, ఆదిలాబాద్ (ఎస్టీ) నుంచి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు.
అయితే అభ్యర్థులు అత్యధికం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. సామాజి వర్గాల వారిగా చూస్తే ముదిరాజ్ కు ఒకటి, మున్నూరుకాపుకు ఒకటి ఇచ్చారు. గౌడ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఇంకా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వరంగల్ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్న పేరు వినిపిస్తోంది.