- Advertisement -
రేవంత్ ఏనాటికైనా బీజేపీ మనిషే
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బాన్సువాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ కామెంట్స్
రేవంత్ రెడ్డి ఏనాటికైనా బీజేపీ మనిషే, ఆయన కప్పుకున్న ముసుగు తొలగించి చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను కోరారు. రేవంత్ ఏనాటికీ కాంగ్రెస్ మనిషి కాలేడని, ఆయన ముందు నుంచి బీజేపీ మనిషి అని, రేవంత్ ముమ్మాటికి బడే భాయ్ తమ్ముడు అని కేటీఆర్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలని, ఆయన లోపల ఉన్న బీజేపీ నాయకుడిని గుర్తించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఓటు వేయాలని కాంగ్రెస్ చెప్తున్న వాదన అర్థరహితమన్నారు. అధికారంలో ఉండి గత రెండు సంవత్సరాల్లో ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. ఒకవేళ రానున్న రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే.. ఆ తరువాత మా ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా పట్టణాలను కాంగ్రెస్ కంటే గొప్పగా గతంలో మాదిరి అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అన్నారు. మైనారిటీలకు, బీసీలకు భారీ ఎత్తున బడ్జెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలైతే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేయాలని, మిగిలిన వాళ్లు ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రూ. 4000 పెన్షన్, రూ. 2500 రూపాయలు మహిళలకు, మరోవైపు విద్యా భరోసా కార్డు గానీ, రైతు భరోసా గానీ, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వచ్చిన వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఇవేవీ ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోయారో బాన్సువాడ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కొడుకులను తిట్టిన ఆడియో వీడియో క్లిప్పులను వినిపించారు. ఆనాడు రేవంత్ రెడ్డి ఇదే పోచారాన్ని అంబోతు అని, ఆయన కొడుకులు దున్నపోతులని, రోడ్డు మీద వదిలారని, కాంట్రాక్టుల పేరుతో అవినీతి చేస్తున్నారని, కమీషన్లు తింటున్నారని, ఇసుక దోపిడీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలని కేటీఆర్ అక్కడి ప్రజలకు వినిపించాడు.
ఆ రోజు రేవంత్ రెడ్డి పోచారం బండ కట్టుకొని బావిలో దూకు అని అన్న మాటలను కేటీఆర్ ప్రస్తావించారు. మరి దీనితో పాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వరుని సాక్షిగా జీవితాంతం కేసీఆర్ వెంట ఉంటానని, కేసీఆర్ చల్లని చూపుతో బాన్సువాడను చేసిన అభివృద్ధి ఎన్నడూ మర్చిపోలేనని, తనకు చూపిన ప్రేమాభిమానాలను కూడా మర్చిపోలేనని పోచారం చెప్పిన మాటల్ని కూడా ప్రజల ముందు కేటీఆర్ చూపించారు. ఇన్ని మాటలు చెప్పిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ సంకన చేరారని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో చొచ్చినా వేల మంది పార్టీ కార్యకర్తలు నాయకులు ఇంకా భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఈనాడు బాన్సువాడ ప్రజలు కూడా గులాబీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారని, కేవలం డబ్బులు ఉన్నంత మాత్రాన పెద్ద నాయకుడు పోచారం కాలేడని అన్నారు. దమ్ముంటే ఇంత అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలని, ప్రజలు ఎవరి వైపు ఉంటారో నిర్ణయిస్తారని కేటీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు. లేకుంటే బండ కట్టుకుని రేవంత్ రెడ్డి అన్నట్లు బావిలో దూకాలన్నారు.
మంత్రిని చేసి, స్పీకర్ ని చేసి గౌరవించుకుని లక్ష్మీ పుత్రుడు అంటే ఆయన బాన్సువాడ ప్రజలను, కేసీఆర్ గారిని, భారత రాష్ట్ర సమితి పార్టీని మోసం చేసి పైసల కక్కుర్తి కోసం కాంగ్రెస్ లో చేరారు అన్నారు. ఆనాడు కేసీఆర్ గారి చలవతో మున్సిపల్ శాఖ మరియు ఇతర శాఖల సహకారంతో సుమారు పదివేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసిందని కేటీఆర్ తెలిపారు.
బాన్సువాడకు జరిగిన అభివృద్ధి అంతా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికే చెందుతుందని, ఒకవేళ నిజంగానే పోచారం అభివృద్ధి చేసి ఉంటే గత రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అక్రమంగా చేరిన తర్వాత బాన్సువాడకి చేసిన ఒక్కటంటే ఒక్క రూపాయి లాభమైనా చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడగాలని కేటీఆర్ అన్నారు.
- Advertisement -



