హైదరాబాద్, అక్టోబరు 11: ఏపీలో రాజకీయాలు రసరంజకంగా ఉన్నాయి. అక్కడి రాజకీయం సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రోజుకొక ట్విస్టుతో అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉండగానే అక్కడి పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉండే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అక్కడి రాజకీయాలు ఇలా ఉండగా ఇప్పుడు సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా మరింత వేడి పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాలి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన వైసీపీకి అనుకూలం అని టీడీపీ ఆరోపించే విధంగా రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వ్యూహం, వ్యూహం-2 (శపథం) పేర్లతో రెండు పార్టులుగా ఈ సినిమాలు తెరకెక్కిస్తున్న వర్ట్మ ఇపుడు ఈ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించి మరింత చర్చనీయాంశం అయ్యారు. నిజానికి ఈ సినిమాల అనౌన్స్ మెంట్ల నుంచి చూస్తే కనుక ఈ సినిమాల పోస్టర్లు, టీజర్లు సంచలనం రేపడమే కాదు పొలిటికల్ దుమారానికి కూడా కారణం అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ చెబుతున్న దాన్ని బట్టి వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిస్థితులు, జగన్ పై కేసులను ‘వ్యూహం’ సినిమాలో చూపించనుండగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని ‘శపథం’లో చూపబోతున్నారు అని అంటున్నారు.ఇక ఈ రెండు భాగాల్లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, వైఎస్ భారతి పాత్రలో మానస నటించారు. దాసరి కిరణ్ కుమార్ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు, గతంలో ఈయన రామ్ గోపాల్ వర్మతో వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలను నిర్మించారు. ఇక ఈ సినిమాల విడుదల తేదీలను రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించారు. ‘వ్యూహం’ సినిమాను నవంబర్ 10న అంటే దాదాపుగా మరో నెల రోజులలో రిలీజ్ చేయనుండగా ‘శపథం’ సినిమాను మాత్రం ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలల ముందు జనవరి 25న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వైసీపీకి ప్లస్ అయ్యేలా టీడీపీ అధినేత గతంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలు తెరకెక్కించారు. వర్మ తనకు ఎలాంటి రాజకీయ సపోర్ట్ లేదని చెబుతున్నా ఆయన చేస్తున్న సినిమాలు కొంతవరకు వైసీపీకి సపోర్ట్ గానే ఉంటాయి. దీంతో ఆ సినిమాను టీడీపీ ఖచ్చితంగా టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి రామ్ గోపాల్ వర్మ ఎలాంటి పొలిటికల్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారతాడు అనేది.