భారీగా పెరుగుతున్న అద్దెలు
హైదరాబాద్, మే 7,
వేగవంతంగా పెరిగిపోతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి. నగరం నాలుగు దిశలలో డెవలప్ మెంట్ పరుగులు తీస్తోంది. ఇక్కడ అన్ని ప్రాంతాల వారూ ఉండదగిన వాతావరణం ఉండటం ప్లస్ పాయింట్. పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాలు ఉండటం మరో ప్లస్ పాయింట్. అయితే ఎక్కడ నుంచే ఉద్యగోలు, వ్యాపారాల కోసం వలస వస్తుంటారు నగరానికి వచ్చీ రాగానే వాళ్లు ముందుగా సొంతింటి కన్నా అద్దె ఇల్లు అందుబాటుల ఎక్కడ ఉంటుందా అని వెదుకుతారు. విద్యాసంస్థలు, ఉద్యోగ శిక్షణ సంస్థలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా ఉండటంతో సమీప ప్రాంతాలలో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. గత నాలుగేళ్లలో గృహాల అద్దెలు గణనీయంగా పెరిగాయి. నెలవారీ సగటు అద్దెలు కొవిడ్ ముందుతో పోలిస్తే ఎనిమిది ప్రధాన నగరాల్లో 25 నుంచి 30 శాతం పెరిగాయని రియల్ ఎస్టేట్ టెక్ ఫ్లాట్‌ఫాం హౌసింగ్.కామ్ తాజాగా ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్ మార్కెట్‌లో 25 శాతం పెరిగాయి. మూలధన విలువల పెరుగుదల కంటే నెలవారీ సగటు అద్దె వృద్ధి ఎక్కువగా ఉందని వెల్లడించింది.దేశీయ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తప్పనిసరిగా కార్యాలయానికి వచ్చి పనిచేయాల్సిందిగా ఆదేశించడంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. బహుళజాతి కంపెనీలు హైబ్రిడ్ మోడల్ అనుసరిస్తున్నప్పటికీ సిటీలో నివాసం అనివార్యంగా మారింది. దీంతో కొవిడ్ సమయంలో ఖాళీ అయిన నివాసాలన్నీ తిరిగి భర్తీ కావడమే కాదు.. గత రెండేళ్లలో కొత్త ఉద్యోగుల రాకతో డిమాండ్ పెరిగింది. ఇవన్నీ కూడా అద్దెల ధరలు పెరగడానికి దోహదం చేశాయి. స్థిరాస్తుల ధరలు పెరగడం కూడా : కొవిడ్ అనంతరం ఇళ్లు, భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఆ తర్వాత కూడా పెరుగుదల స్థిరంగా కొనసాగింది. ఇంటిపై వ్యయం చేసేటప్పుడు వచ్చే అద్దెలు ఎంత అనేది కూడా చూస్తారు. దీని ఆధారంగానే కొందరు పెట్టుబడి పెడుతుంటారు. ఐటీ వంటి సేవా రంగం ఆధిపత్యం ఉన్న నగరాల్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో అద్దెలు 30 శాతానికి మించి పెరిగాయి.మున్ముందు ఇదే విధంగా రాబోయే రెండు మూడేళ్లలో సిద్ధమైన ఇళ్లు మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నప్పటికీ అద్దె డిమాండ్ కొనసాగుతుందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో నిరంతర వృద్ధి కారణంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని చెబుతున్నారు. ఇంటి అద్దెలు పెరగడానికి ఆర్థిక అంశాలు కూడా మరో కారణం. ఇల్లు కొనాలంటే డౌన్ పేమెంట్, నెలవారీ వాయిదా, నిర్వహణ తదితర ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దీంతో చాలామందికి అద్దె ఇళ్లలో ఉండటమే మెరుగైన ఎంపికగా ఉంటుంది. ఆర్థికంగా కాస్త వెసులుబాటు ఉండాలనుకునేవారికి, ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభిస్తున్నవారికి ఇల్లు కొనడం కంటే అద్దె ఇంట్లో ఉండటమే మంచి ఆప్షన్ గా ఉంటోంది. దీంతో దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది.అద్దె మార్కెట్ పెరగడానికి మిలీనియల్ జనరేషన్ కూడా ఓ కీలక కారణం. మిలీనియల్స్ ఆస్తుల కంటే అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో ఒక్కరే సొంతింట్లో ఉండటం కంటే స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉండటానికే మొగ్గు చూపిస్తున్నారు. మారుతున్న జీవనశైలి, మిలీనియల్స్ కు పెరిగిన కొనుగోలు శక్తి కూడా దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడానికి కారణాలు. మొత్తానికి చూస్తే.. దేశంలో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో సామాజిక, ఆర్థిక అంశాలతోపాటు జీవనశైలి మార్పులు కూడా ఉన్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ, మారుతున్న యువతరం ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుంటే అద్దె ఇళ్ల డిమాండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది. దీంతో అద్దె మార్కెట్ లో రియల్ పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు పెరుగుతాయి.