ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి రైతులతో మాట్లాడారు.
వాకాడు మండలంలోని స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలించారు. ఈ క్రమంలో నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.
కాగా, సీఎం జగన్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ఈ నాలుగైదు రోజుల్లో భారీ వర్షం కురిసింది. మనకు వచ్చిన కష్టం.. మనకు వచ్చిన నష్టం వర్ణణాతీతమే. వరుసగా వర్షాలు పడటంతో రైతులు నష్టపోయారు. సాయం కోసం 92 రిలీఫ్ కేంద్రాలను పెట్టడం జరిగింది. 60 వేల మంది బాధితులకు 25 కేజీల రేషన్ బియ్యంతో పాటు నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగింది. ప్రతీ ఇంటికి రూ. 2,500 ఇచ్చాము. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వమని అన్నారు.
ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ మన దగ్గరే ఉంది. ప్రతీ ఇంటికి వాలంటీర్ వచ్చి రూ. 2,500 ఇస్తారు. పంట నష్టంపై కూడా ఏ ఒక్కరూ బాధపడనవసరం లేదు. స్వర్ణముఖిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపడతాం. వారంలో అందరికీ సాయం చేస్తాను. నష్టపోయిన ప్రతీ రైతును ఆందుకుంటాం. ఏ ఒక్కరికీ నష్టం జరగనివ్వం. నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందిస్తాం. రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలు చేపడతాం. తుపాను బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని అన్నారు..



