Saturday, March 14, 2026

మార్చి 26 నుంచి ఆర్టీసీ సమ్మె

- Advertisement -

మార్చి 26 నుంచి ఆర్టీసీ సమ్మె
హైదరాబాద్, మార్చి 14

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది ఆందోళన బాట పట్టనున్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. మార్చి 13న డెడ్‌లైన్ విధించినప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో శుక్రవారం ఆర్టీసీ యాజమాన్యానికి జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా సమ్మె నోటీసును అందజేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై గత నెలలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మార్చి 13లోగా పరిష్కారం లభించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని, ఆపై సమ్మెకు దిగుతామని స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో కదలిక లేకపోవడంతో ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌కు, అలాగే కార్మిక శాఖ కమిషనర్‌కు నాయకులు సమ్మె నోటీసులు అందజేశారు. చట్టప్రకారం 14 రోజుల నోటీసు పిరియడ్‌ తర్వాత అంటే మార్చి 26 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్‌లు నిలిపివేసి సమ్మె ప్రారంభించనున్నట్టు జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీ జేఏసీ  నేతృత్వంలో మొత్తం 31 డిమాండ్లతో కూడిన నివేదికను యాజమాన్యానికి సమర్పించారు. ఇందులో ఆర్థికపరమైన అంశాలతోపాటు సంస్థ మనుగడకు సంబంధించిన కీలక డిమాండ్లు ఉన్నాయి. ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేసి, పని చేస్తున్న ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2017 నాటి వేతన సవరణను అమలు  చేసినప్పటికీ , దానికి సంబంధించిన ఎరియర్స్‌ను ఇంకా చెల్లించలేదు. సుమారు 2,150 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కార్మికులు కోరుతున్నారు. 2021 నాటి వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో తక్షణమే ప్రకటించి, అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి రావాల్సిన నిధుల్లో కోత విధిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. నెలకు 350 కోట్ల చొప్పున ఎటువంటి మినహాయింపులు లేకుండా ఆర్టీసీకి చెల్లించాలని వారు కోరుతున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన 2500 కోట్ల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సంస్థను కాపాడుకోవడంలో భాగంగా ఈవీ బస్‌ల నిర్వహణపై జేఏసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించకుండా, ఆర్టీసీ ద్వారానే నడపాలని, తద్వారా సంస్థ ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచించింది. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీని వల్ల కండక్టర్లు, డ్రైవర్లపై పని భారం అధికమైందని, దీనిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. మరోవైపు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల కార్మికులకు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక ప్రజాస్వామ్య వేదిక లభిస్తుందని వారు భావిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్