Sunday, September 8, 2024

కాంగ్రెస్ ను దెబ్బతీయనున్న రైతు బంధు, ఎస్సీ వర్గీకరణ

- Advertisement -

తెలంగాణలో ఎన్నికల యుద్ధం చివరి దశకు వచ్చింది.  విజయం కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతున్నాయి. బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలన్నీ పక్కన పెడితే.. హఠాత్తుగా తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసేలా రెండు నిర్ణయాలు జరిగాయి. ఒకటి రైతు బంధు నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం, రెండు ఎస్సీ రిజర్వేషన్లలో సబ్-కేటగిరైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ  కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ రెండు తెలంగాణ ఓటర్లను ప్రభావితం చేసేవే. కాంగ్రెస్‌కు నష్టం కలిగించేవే. మరి ఎవరికి లాభం జరుగుతుందంటే.. ఖచ్చితంగా బీఆర్ఎస్ కే అనే విశ్లేషణ ఎక్కువగా వినిపిస్తోంది. రైతు బంధు పథకానికి నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుకుందని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదట్లో బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. తర్వాత రుణమాఫీ చేయడానికి, ఉద్యోగులకు డీఏ ఇవ్వడానికి కూడా ఈసీ అంగీకరించలేదని ప్రభుత్వం చెప్పింది. కానీ హఠాత్తుగా రైతు బంధు నిధులు అకౌంట్లలో జమ చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ నుంచి సమాచారం వచ్చింది.  రైతు బంధుకు నిధులు ఇస్తామని ఇలా అడగగానే అలా ఈసీ అనుమతి ఇచ్చింది. పోలింగ్ కు ముందు ఇలాంటి అవకాశం ఇవ్వడంతో ఈ మాత్రం చాలదా అని అప్పటికప్పుడు  రైతు బంధు లబ్దిదారుల ఖాతాల్లోని నగదు జమ చేసేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.   తెలంగాణ సర్కార్ వద్ద నిధుల్లేకపోవడంతో కొన్ని పథకాలు అమలు చేయకుండానే ఎన్నికలకు వెళ్లారు.  ఆ పథకాల సొమ్ముల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.  వాటిలో రుణమాఫీ కూడా ఉంది. కానీ రుణమాఫీ చేసే పరిస్థితి లేదు. ఎక్కువ మంది ఖాతాల్లో డబ్బులు జమ చేయాలంటే రైతుబంధునే కరెక్ట్ అనుకుని నెలాఖరులో డబ్బులు సమకూరుతాయి కాబట్టి వెంటనే రైతు బంధు ఇచ్చేందుకు  దరఖాస్తు చేశారు. ఇలా దరఖాస్తు చేయగానే అలా అనుమతి ఇచ్చేసింది. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే  చెక్కులు పంపిణీ చేసి విజయం సాధించింది.  ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఎవరికైనా ప్రభుత్వం డబ్బులు జమ చేయాలనుకుంటే..  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే  పూర్తి చేయించాలని.. ఆ తర్వాత వద్దని కాంగ్రెస్ పార్టీ ముందే ఫిర్యాదు చేసింది. కానీ ఈసీ పట్టించుకోలేదు.  పోలింగ్ కు ఐదు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసే అవకాశాన్ని కల్పించింది.  అవేమీ జీతాలు కాదని పోలింగ్ అయిన తర్వాత ఒకటో తేదీన పంపిణీ చేసినా నష్టమేమిటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గత ఏడాది డిసెంబర్ ఆఖరులో రైతు బంధు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.  60 లక్షల మంది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తే.. వారి కుటుంబాలు ఓట్లు వేస్తే బీఆర్ఎస్‌కు మేలు జరగడం ఖాయమే.    బీజేపీ సహకారం లేకపోతే రైతు బంధు పథకానికి నిదులను విడుదల చేసే అవకాశమే వచ్చేది కాదు. నిబంధనల ప్రకారం… ఈసీ  పోలింగ్ కు ముందు ప్రభుత్వ పథకాలైనా సరే మంజూరు చేసేందుకు అంగీకరించదు. పోలింగ్ ముగిసిన తరవాతనే చేసుకోమంటుంది. కానీ ఇక్కడ పోలింగ్ కు ఐదు రోజుల ముందు నగదును జమ చేయడానికి పర్మి,షన్ ఇచ్చింది. అది కూడా అరవై లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేయడానికి.  బీజేపీ సహకారం లేకపోతే సాధ్యం కాదని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో సబ్-కేటగిరైజేషన్ ప్రక్రియ ను వేగవంతం చేయడానికి ఒక కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ   కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఇతర సీనియర్ అధికారులను ఆదేశించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి  గత 30 ఏళ్లుగా పోరాడుతోంది. దీన్ని మందక్రిష్ణ  స్థాపించారు. గత మూడు దశాబ్దాలుగా జరిగిన ప్రతి పోరాటంలో బీజేపీ వారికి అండగా నిలుస్తోందని ఇటీవల తెలంగాణలో హైదరాబాద్ లో జరిగిన సభలో మోదీ అన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఇది కూడా కీలక పరిణామంగా మారింది. ఈ రెండు అంశాలు ఓటర్లను ప్రభావితం చేసేవే. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు ప్రభావం చాలా ఎక్కువ.  ఎన్నికల్లో ఆర్థిక అవసరాల గురించి చెప్పాల్సిన పని లేదు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా లోటు లేదు.   కాంగ్రెస్ నేతలకు ఏ చాన్స్ ఉండనీయడం లేదు.   వారి ఆర్థికమూలాల్ని కట్టడి చేస్తున్నారు.  ఐటీ, ఈడీలతో విస్తృతంగా దాడులు చేస్తున్నారు.  ఇటీవలి కాలంలో  పట్టుబడుతున్న నగదు మొత్తం కాంగ్రెస్ వాళ్లదే. అన్ని రకాలుగా నిఘా పెట్టి పూర్తి స్థాయిలో నిధులను పట్టేసుకుంటున్నారు. దీంతో  కాంగ్రెస్ అభ్యర్థులు నగదు లోటును ఎదుర్కొంటున్నారు.  మరో వైపు  పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇద్దరూ సమావేశం అవుతున్నారని అంటున్నారు.   కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు అందకుండాచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ  పరిణామాలన్నింటి వెనుక బీజేపీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత కొంత నష్టం చేస్తాయి. మరి బీజేపీకి మేలు చేస్తాయా అంటే.. అలాంటి చాన్స్ లేదని చెప్పుకోవచ్చు. కేవలం కాంగ్రెస్ పార్టీని నష్టపరచడానికి ఈ నిర్ణయాలన్నీ ఉపయోగపడతాయి. అందుకే.. బీజేపీ రాజకీయంపై భిన్నమైన విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ కు నష్టం చేసేందుకే రాజకీయం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే.. పోలింగ్ గడువు ముంచుకొచ్చేస్తోంది మరి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్