రైతు భరోసా: రేవంత్‌కు సవాల్‌గా మారిన పెట్టుబడి సాయం
హైదరాబాద్
Rythu Bharosa: Investment Assistance Becomes a Challenge for Revanth
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం అమలు ఇప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద సవాల్‌గా మారింది. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ. 15,000 ఇస్తామన్న మాటను అమలు చేయడంలో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, విపక్షాల విమర్శలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..
మూడు విడతల వ్యూహం: ఆర్థిక భారమే కారణమా?
ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి సుమారు రూ. 9,000 కోట్లను రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ నిధులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేయాలని నిర్ణయించడం వెనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి విడతగా మార్చి 22న రూ. 3,590 కోట్లను సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ తర్వాత 20 రోజులకు రెండో విడత రూ. 2,650 కోట్లు , ఏప్రిల్ నెలాఖరుకు మూడో విడత నిధులు విడుదల కానున్నాయి. ఈ విడతల వారీ పంపిణీ నిధుల సర్దుబాటులో ఉన్న ఇబ్బందులను స్పష్టం చేస్తోంది.
హామీల అమలుపై ప్రశ్నలు:
రైతు భరోసా నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై బీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా నిలదీస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ బంధు పేరుతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించగా, ఎన్నికల హామీ ప్రకారం పెంచిన నగదును ఎందుకు ఇవ్వడం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్,ఇతర సాంకేతిక కారణాల వల్ల నిధుల విడుదల ఆలస్యమైనప్పటికీ, విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో ఈ సాయం అందకపోవడం రైతాంగంలో కొంత అసంతృప్తికి దారితీసింది. ఈ విమర్శలను తిప్పికొట్టడమే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ముందున్న తక్షణ కర్తవ్యం..
సిద్దిపేట వంటి కీలక జిల్లా నుంచి ఈ నిధుల విడుదలను ప్రారంభించడం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉంది. హరీష్ రావు వంటి బలమైన నేతలున్న జిల్లాలో రైతు భరోసాను ఘనంగా ప్రారంభించడం ద్వారా క్షేత్రస్థాయిలో రైతుల మద్దతును కూడగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో, అర్హులైన రైతుల ఎంపికలోనూ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో సాగులో లేని భూములకు కూడా నిధులు వెళ్లాయన్న విమర్శల నేపథ్యంలో,ఈసారి నిబంధనలను కఠినతరం చేయడం వల్ల మరిన్ని రాజకీయ వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. రూ. 9,000 కోట్ల నిధులను సక్రమంగా పంపిణీ చేసి, రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అగ్నిపరీక్ష లాంటిదే.. ఏప్రిల్ నెలాఖరు కల్లా పూర్తి నిధులు జమ కాకపోతే రేవంత్ పై నమ్మకం తగ్గిపోయే అవకాశాలుంటాయి.



