అమరావతి ఓఆర్ఆర్ అనుసంధానాలపై సర్కార్ ఆదేశాలు
Sarkar orders on Amaravati ORR connectionsవిజయవాడ
అమరావతి అవుటర్ రింగ్రోడ్డు (ఓఆర్ ఆర్) అలైన్మెంట్ జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే చోట గందరగోళం లేకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థకు నిర్దేశించింది. ఈ ప్రాజెక్టు మొత్తం 7
జాతీయ రహదారులతో అనుసంధానమవుతుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో అమరావతి రాజధానికి రోడ్డు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ అలైన్మెంట్ మలుపులు లేకుండా ఉండేలా చూడటంతో పాటు
ఆయా జాతీయ రహదారులు అనుసంధానమయ్యే చోట ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలని ప్రభుత్వం నిర్దేశించింది. నేరుగా అనుసంధానం అయ్యే చోట ఈ జాగ్రత్తలు బాగా తీసుకోవాలని
పేర్కొంది. అలాగే, ట్రంపెట్ ఇంటర్ చేంజ్ల విషయంలో కూడా ఎలాంటి గందరగోళం, సమస్యలకు అవకాశం లేకుండా అనుసంధానమయ్యేలా చర్యలు చేపట్టాల్సిందిగా తెలిపింది. దీంతో అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుతో
అనుసంధానమయ్యే మచిలీపట్నం-హైదరాబాద్ (ఎన్హెచ్-65), కొండమోడు-పేరేచర్ల (ఎన్హెచ్-163ఈజీ), చెన్నై-కోల్కతా (ఎన్హెచ్-16), విజయవాడ-ఖమ్మం-నాగపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే (ఎన్హెచ్-163జీ),
గుంటూరు-అనంతపురం (ఎన్హెచ్-544డీ), ఇబ్రహీంపట్నం-జగదల్పూర్ (ఎన్హెచ్-30) వంటి వాటి విషయంలో జాతీయ రహదారుల సంస్థ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు.




