హైదరాబాద్, నవంబర్ 20, (వాయిస్ టుడే): హైదరాబాద్ నగర శివారు అప్పా జంక్షన్ వద్ద శనివారం 6 వాహనాల్లో పట్టుబడిన రూ.7.40 కోట్ల నగదుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు 10 మందికి 41ఏ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రాజకీయ పార్టీ నేత సమీప బంధువులున్నట్లు సమాచారం. ఈ నగదును అజీజ్ నగర్ పరిధిలో ఓ విద్యా సంస్థల ఛైర్మన్ కు చెందిన ఫాంహౌస్ లో నుంచి తరలించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఫాంహౌస్ తో పాటు, ఆయన ఇల్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే నగదు సీజ్ చేయగా, సోమవారం న్యాయస్థానంలో డిపాజిట్ చేయనున్నారు. ఎన్నికల ఖర్చుల కోసమే డబ్బు పంపేలా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.మరోవైపు, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ అధికార, ప్రతిపక్ష నేతల వాహనాలను సైతం క్షుణ్ణంగా సోదా చేసిన అనంతరమే విడిచి పెడుతున్నారు. అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకూ రూ.625 కోట్లకు పైగా మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకూ రూ.18.64 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.99.49 కోట్లకు పైగా ఉండగా, మత్తు పదార్థాల విలువ రూయ34.35 కోట్లకు పైగా ఉందని వివరించారు. వీటితో పాటు రూ.78.62 కోట్లకు పైగా విలువైన బహుమతులు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.మరోవైపు, సైఫాబాద్ పోలీసులు ఓ బ్యాంకులో రూ.8 కోట్ల నగదు ఫ్రీజ్ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలతో చర్యలు చేపట్టారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ అనే సంస్థకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో HDFC బ్యాంకు ఖాతా నుంచి ఐడీబీఐ బ్యాంకు ఖాతాకు బదిలీ అయిన నగదును ఆదివారం పోలీసులు ఫ్రీజ్ చేశారు. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్, ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు.