ఆరుగురి ఎంపిక… రేవంత్ బిగ్ టాస్క్…
హైదరాబాద్, అక్టోబరు 2,
Selection of six… Revanth Big Task…
కేబినెట్ విస్తరణ ఇప్పుడు అప్పుడు అంటూ లీకులు ఇవ్వడమే తప్పితే.. ఇంతవరకు విస్తరించింది అయితే లేదు. అటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసి కూడా వంద రోజులు ఎప్పుడో గడిచాయి. ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి పది నెలలు అవుతోంది. కానీ.. ఇంతవరకు విస్తరణకు మాత్రం నోచుకోవడం లేదు. ఆలస్యం అవుతున్న కొద్దీ రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో అధిష్టానానికి పెద్ద టాస్కులా మారింది.కేబినెట్ విస్తరణపై.. ఇటు ముఖ్యమంత్రి, అటు అధిష్టానం మధ్యం సయోధ్య కుదరడం లేదనే ప్రచారం కూడా ఉంది. అటు రేవంత్ రెడ్డి సిఫారసులు చేస్తుండడం.. పలువురు సీనియర్లు కూడా వారికి తోచిన వారి పేర్లు ఇస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నప్పటికీ ప్రతిసారీ వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఢిల్లీకి 23 సార్లు వెళ్లారు. అందులో మెజార్టీ ప్రయాణాలు కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు వెళ్లారని ప్రచారం. నిన్న సాయంత్రం కూడా రేవంత్ మరోసారి ఢిల్లీకి వెళ్లారు. దాంతో మరోసారి కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.రేవంత్ అధికారం చేపట్టాక 12 మందితో కేబినెట్ కొలువుదీరింది. మరో ఆరుగురికి ఛాన్స్ ఉండడంతో.. ఆ ఆరుగురి ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడున్న కేబినెట్‌లోనూ చాలా వరకు నేతలు రేవంత్ కు తోడుగా నిలబడడం లేదనే టాక్ నడుస్తోంది. దాంతో ఆ ఆరుగురి ఎంపిక ఆయన కనుసన్నల్లోనే జరగాలనే భావనతో రేవంత్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సందర్భంలో ఒకరిద్దరు మినహా మిగితా వారి నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. బీఆర్ఎస్, బీజేపీలు నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నప్పటికీ వాటిని వ్యతిరేకించే వారు కరువయ్యారు.అందుకే.. మంత్రివర్గం నుంచి రేవంత్ కు పెద్దగా మద్దతు లభించడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే.. రేవంత్ సిఫారసులకు పలువురు సీనియర్లు అడ్డు పడుతున్నారని తెలుస్తోంది. జమ్ము ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ కేబినెట్‌పై పెద్దగా దృష్టి సారించడం లేదు. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు పూర్తికానున్నాయి. దాంతో ఇప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. ఇక నాన్చివేత ధోరణి అవలంబించకుండా.. ఏదో ఒకటి చేసి ఆ ఆరుగురిని ఎంపిక చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. అధిష్టానం నిర్ణయంలో సీఎం రేవంత్ సిఫారసులకు పెద్ద పీట వేస్తారా..? సీనియర్లకే ప్రాధాన్యత ఇస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ ఇచ్చిన పేర్లను ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తున్నా.. రేవంత్‌కు ప్రిపరెన్స్ ఇస్తే సీనియర్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందా అని అధిష్టానం పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రాష్ట్రం ఆరుగురిని ఎంపిక చేసే అంశం మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి బిగ్ టాస్క్ అయింది.