- Advertisement -
మళ్లీ సీనియర్లు…వాయిస్ పెంచుతున్నారే
Seniors are raising their voices again
మెదక్, డిసెంబర్ 16, (వాయిస్ టుడే)
ఒకప్పుడు తెలంగాణ కాంగ్రెస్.. వర్గ విభేదాలకు పుట్టినిళ్లు. పార్టీలో ఎవరి దారి వాళ్లదే. ఎవరి నిర్ణయం వాళ్లదే. టికెట్ల నుంచి పదవుల పంపకాల వరకు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ. ఇదే కాంగ్రెస్‌కు ఉన్న పెద్ద మచ్చ. తమ వర్గానికి చెందిన వారికి టికెట్లు రాలేదని.. పదవులు దక్కలేదని.. ఎప్పుడూ ఏదో ఇష్యూతో ఇంటిపోరు ఉండేది. కొన్నిసార్లు అయితే.. గల్లీ లొల్లి ఢిల్లీ దాకా వెళ్లేది. ఆ సందర్భంలో నేతల్ని సముదాయించడం హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారేది.కానీ రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నేతల్లో మార్పు వచ్చినట్లు కనిపించింది. సీఎం సీటు కోసం పదుల సంఖ్యలో సీనియర్లు ప్రయత్నాలు చేసినా.. అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. మంత్రి పదవుల పంపకాల్లో, ఎంపీ టికెట్ల పంపకాల్లోనూ ఎక్కడ అసంతృప్తి గళం వినబడలేదు. కనబడలేదు.ఏడాది కాలంగా.. కాంగ్రెస్ నేతలందరిది ఒక్కటే స్వరం.. ఒక్కటే మార్గం. అధిష్టానం చెప్పిందే చేశారు. పెద్దలకు నచ్చిందే చేశారు. సమిష్టి కృషికి సంపూర్ణ అర్ధమిచ్చేలా మెదిలారు. గ్రూప్ తగదాలకు చెక్ పెట్టి.. ప్రతిపక్షాలను ఎదుర్కొవడంలో ఫుల్ సక్సెస్ అయ్యారు. జగిత్యాల సెంటర్‌లో వలసల లొల్లి సలసలా కాగినట్లు కనిపించినా టీకప్పులో తుఫానులా సమసిపోయింది.. ఆ సమయంలోనూ పార్టీ ముఖ్య నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి జీవన్‌రెడ్డిని బుజ్జగించి ఇది మారిన కాంగ్రెస్ అనుకునేలా చేశారు..ఐతే ఏడాది ఐకమత్యానికి ఎక్కడో బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది.. తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలకు చెక్ పడిందని అందరూ డిసైడ్ అయిన వేళ మళ్లీ అసంతృప్తి స్వరాల గర్జన వినిపిస్తోంది.. మళ్లీ లొల్లి ట్రాక్ ఎక్కింది. ఇన్నాళ్లు నిశ్చబ్దంగా ఉన్న సీనియర్లు.. నివురుగప్పిన నిప్పు కణికలని తేలిపోయింది. సీనియర్లు ఒక్కొక్కరు సొంత స్వరం వినిపిస్తున్నారు.ఏ నిర్ణయం తీసుకున్నా… తల ఊపేది లేదు. ఊరుకునేదే లేదని తేల్చిచెబుతున్నారు.. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రూపంలో జగడం మొదలైంది. అసలే జగ్గారెడ్డి. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేస్తారు. నచ్చకపోతే సొంత పార్టీ నేతల్నే నిలదీసే తత్వం ఆయన సొంతం. ఐతే ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న జగ్గారెడ్డి సడెన్‌గా పార్టీ నేతలకు వ్యతిరేకంగా స్వరం వినిపించారు. కాంగ్రెస్‌ను చంపేస్తారా అంటూ జాతీయ నాయకులపై విరుచుకుపడ్డారు.ఐతే జగ్గారెడ్డి ఇంతలా ఫైర్ అవడానికి కారణం కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారమేనన్నది ఇన్‌సైడ్ టాక్.. తెలంగాణ వచ్చాక పదేళ్లు పదవులకు దూరంగా ఉంటూ.. పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వారిని కాదని పదవుల పంపకాలు జరుగుతున్నాయనేది ఆయన ఆవేదన అంట.. పదవుల పందేరంలో పై స్థాయిలో ఉన్న ఇద్దరు, ముగ్గురు నేతలే డిస్కస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారనేది ఆయన ఆగ్రహానికి కారణమంట.ఇదే విషయాన్ని ఓ ఫంక్షన్‌లో ఎదురుపడిన పార్టీ సహ ఇన్‌ఛార్జి విష్ణునాథ్‌ను జగ్గారెడ్డి పట్టుకొని నిలదీశారని, పార్టీ గ్రౌండ్ లెవల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారా? మీకు మీరే డిసైడ్ అయితే మేమేందుకు అని కూడా ప్రశ్నించారనేది గాంధీ భవన్‌లో రీసౌండ్ చేస్తున్న గాసిప్..ఏడాది నుంచి ఊరిస్తూ ఉసూరుమనిపిస్తున్న పోస్టులు ఇప్పుడు అందకుండా పోతే ఆశావాహుల అసంతృప్తి మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.. మరి ఇంటి పంచాయితీని పార్టీ పెద్దలు ఎలా డీల్ చేస్తారు.. సీనియర్ల పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను హైకమాండ్ పట్టించుకుంటుందా? లైట్ తీసుకుంటుందా? అనేది వేచి చూడాలి.
- Advertisement -