హైదరాబాద్, నవంబర్ : ఈ నెల 30న తెలంగాణతో పాటు దేశంలోని మరో 4 రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు వాటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎసి పాండే, అరుణ్ గోయెల్‌లు గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి అంజనీ కుమార్ లు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్దంగా ఉందని, తెలంగాణలో శాంతి బధ్రతలు అదుపులో ఉన్నాయని ప్రధాన ఎన్నికల అధికారికి శాంతి కుమారి వివరించారు. ఇప్పటి కే తెలంగాణ సరిహధ్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్ పోస్ట్ లను కట్టు దిట్టం చేశామని వివరించారు.

రాష్ట్రంలో నిఘా పెంచడం జరిగిందని దీని ఫలితంగా రూ. 385 కోట్ల మేర నగదు జప్తు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 17 సరిహద్దు జిల్లాల్లో 166 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాలు 154 సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాయని ఆమె తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలతో సమర్థవంతమైన సమన్వయం కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. నవంబర్ 28వ తేదీ నుంచి పోలింగ్ జరిగే 30వ తేదీ వరకు రాష్ట్రంలో డ్రై డేగా ప్రకటించామన్నారు.




