హైదరాబాద్, ఆగస్టు 24: నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. నగర పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి దేవేందర్ గాయన్ అనే వ్యక్తిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యారు.
మదీనాగూడలో జరిగిన ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన దేవేందర్ను ఘటనాస్థలంలోని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్ డీసీపీ సందీప్, మియాపూర్ పోలీసులు అక్కడ 6 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కాల్పుల్లో మరణించిన దేవేందర్ను ఘటనాస్థలంలోనే ఉన్న కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్ జనరల్ మేనేజర్గా గుర్తించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే దేవేందర్పై దాడి చేసినవారు మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు జరిపారని, మృతుడు వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. దేవేందర్ హోటల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి అతనిపై కాల్పులు జరిపారని, కాల్పుల కోసం కంట్రీ మేడ్ పిస్టల్ని ఉపయోగించారని పోలీసులు పేర్కొన్నారు.
అలాగే దేవేందర్ 6 నెలలుగా కిన్నెర గ్రాండ్ సందర్శిని హోటల్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడని, అతనిపై కాల్పులు జరిపిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని మియాపూర్ పోలీసులు తెలిపారు…
హోటల్ జనరల్ మేనేజర్ పై కాల్పులు … మృతి
- Advertisement -
- Advertisement -